-

బాలాకోట్‌ మళ్లీ యాక్టివేట్‌ అయింది: ఆర్మీ చీఫ్‌

23 Sep, 2019 12:34 IST|Sakshi

చెన్నై: పాకిస్థాన్‌ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలు మళ్లీ ఇటీవల యాక్టివేట్‌ అయ్యాయని, దాయాది దేశం వీటిని యాక్టివేట్‌ చేసిందని భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా గత ఫిబ్రవరిలో బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌ సంస్థ ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 

‘పాకిస్థాన్‌ ఇటీవలే బాలాకోట్‌ను యాక్టివేట్‌ చేసింది. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలు దెబ్బతిని, ధ్వంసమైన విషయాన్ని ఇది చాటుతోంది. భారత వైమానిక దళాలు జరిపిన దాడిలో బాలాకోట్‌ ధ్వంసమైన సంగతిని ఇది చాటుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు’ అని రావత్‌ పేర్కొన్నారు. చెన్నైలో యంగ్‌ లీడర్స్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. సరిహద్దుల్లో దాదాపు 500 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడటంపై రావత్‌ స్పందిస్తూ.. ఉగ్రవాదులు చొరబాటుకు వీలుగా పాక్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, దీనిని ఎలా ఎదుర్కోవాలో భారత్‌ సైన్యానికి తెలుసునని అన్నారు. 
 

మరిన్ని వార్తలు