ఔషధ మొక్కల తల్లి తులసి

4 Jun, 2015 09:46 IST|Sakshi
ఔషధ మొక్కల తల్లి తులసి

న్యూఢిల్లీ: భారతీయులు అతి పవిత్రంగా భావించే మొక్కల్లో ముఖ్యమైంది ’తులసి‘. ఇంటి ముందు తులసి లేని ఇళ్లు చాలా తక్కువ. ఈ మొక్కతో ఎన్నో ప్రయోజనాలు. అనేక ఔషధాల్లో తులసిని ఉపయోగిస్తారు. దీన్ని ఔషధ మొక్కలకు తల్లిగా అభివర్ణిస్తారు. తులసి మీద ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా భారత శాస్త్రవేత్తలు తులసి జీనోమ్ (జన్యుక్రమం) ను కనుగొన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ప్రత్యేకంగా పెంచిన తులసి మొక్కల నుంచి సేకరించిన ఆకుల కణజాలాల్ని   విశ్లేషించి జన్యుక్రమాన్ని గుర్తించారు.

ఈ ఫలితంతో భవిష్యత్‌లో తులసి నుంచి మరెన్నో ఔషధాలు తయారు చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ జన్యుక్రమాన్ని గుర్తించడం ద్వారా వైద్యరంగంలో తులసితో కొత్త ఔషధాలు తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఔషధ రంగానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు తెలిపారు. తులసిలో ఫినైల్ ప్రోపనాయిడ్స్, టెర్పనాయిడ్స్‌లాంటి అనేక కర్బన పదార్థాలున్నాయి. వీటివల్లే దీనికి ఎక్కువగా ఔషధ లక్షణాలొచ్చాయి. తులసిలో అనేక జాతులున్నాయి.

అనేక చికిత్సల్లోనూ: తులసిని దేశంలోనూ, విదేశాల్లోనూ అనేక ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఆయుర్వేదం, సిద్ధ, యునాని, గ్రీకు, రోమన్ వైద్య చికిత్సల్లో ప్రధానంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇక మన దేశంలో గృహ వైద్యంలో తులసిది ప్రత్యేక స్థానం. ఈ మొక్క అన్ని భాగాలూ ఔషధ గుణాన్ని కలిగి ఉన్నాయి.
 
తులసి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు
కొన్ని నీళ్లల్లో తులసి ఆకులను మరిగించి తాగడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. దగ్గు కూడా తొలగిపోతుంది. శ్వాస సంబంధ సమస్యలు, జ్వరాన్ని నివారించే లక్షణాల్ని  తులసి కలిగి ఉంది. ఆరు నెలల పాటు తులసి, తేనె కలిసి తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయి. దంత సమస్యలు, తలనొప్పి, కంటి సమస్యల నివారణలో కూడా తులసిని వినియోగిస్తారు.

మరిన్ని వార్తలు