బెంగళూరు: ఐటీకి ఏటా 24 వేల కోట్ల నష్టం

22 Dec, 2018 18:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగుల శారీరక అనారోగ్యం, శారీరక శ్రమ రాహిత్యం, మానసిక ఉద్వేగం తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరడగం, క్రమశిక్షణలేని జీవన శైలి తదితర కారణాల వల్ల భారత సిలికాన్‌ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో ఏటా ఐటీ పరిశ్రమకు 24 వేల కోట్ల రూపాయల రాబడి తగ్గుతోందట. రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ సంస్థ బెంగళూరులోని పది పెద్ద ఐటీ కంపెనీలలోని 500 మంది ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఈ అధ్యయనం జరిపింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఇన్ఫోసిస్, విప్రో, మైండ్‌ట్రీ లాంటి భారతీయ కంపెనీలకు ప్రపంచ హెడ్‌ క్వాటర్స్‌ ఇక్కడ ఉండగా, ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలకు ఇక్కడ భారతీయ హెడ్‌ క్వాటర్స్‌ ఇక్కడ ఉన్నాయి.
 
భారత దేశం మొత్తం మీద ఐటీ పరిశ్రమలో 165 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతుండగా, ఒక్క బెంగళూరు నగరంలోనే ఏటా 50 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఉద్యోగుల శారీరక, మానసిక అనారోగ్యం, అపసవ్య జీవన శైలి తదితర కారణాల వల్ల నగరంలోని మొత్తం రెవెన్యూలో ఏడు శాతం నష్టపోతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకే ఎక్కువగా అనారోగ్య అలవాట్లు, అనారోగ్య జీవన శైలి ఉందని, నష్టపోతున్న రెవెన్యూలో 42 శాతం వాటా వీళ్ల కారణంగానే జరుగుతోందని అధ్యయనం తేల్చింది. యువతీ యువకులకు వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శారీరక బలహీనత సమస్యలు తలెత్తుతుంటే పెద్ద వారికి సరైన వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్ల బలహీనత సమస్యలకు గురవుతున్నారు.

ఇదివరకు ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసానికి అట పాటలకు క్యాంపస్‌లోనే సౌకర్యాలు ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశమ్రలో మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా కంపెనీల యాజమాన్యాలు ఇలాంటి సౌకర్యాలను తొలగించింది. ఇదివరకు ఉద్యోగుల కోసం ‘ఫిజికల్‌ ఫిట్‌నెస్‌’ సిబ్బంది కూడా ఉండేవారట. వారంతా కూడా కాలక్రమంలో కనిపించకుండా పోయారు. ఉద్యోగులే వారంతట వారే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ‘మెడిటేషన్‌’ లాంటి విద్యలు ప్రాక్టీస్‌ చేస్తున్నారట!

మరిన్ని వార్తలు