ఎన్‌ఆర్సీపై ఆందోళన వద్దు..

21 Dec, 2019 04:14 IST|Sakshi

ప్రజాభిప్రాయం స్వీకరించాకే చట్టం తెస్తాం

పౌరసత్వ సవరణ అంతా రాజ్యాంగబద్ధమే

సవరణ న్యాయ సమీక్షలో నెగ్గుతుంది

హింసకు పాల్పడితే తప్పించుకోలేరు

రాజకీయ పార్టీల కుట్రలోఇరుక్కోవద్దు

మోదీపై కక్షతో పౌరసత్వ సవరణను వ్యతిరేకించొద్దు

అంతర్జాతీయ సమాజం ముందు పలుచన చేయొద్దు

‘సాక్షి’ ఇంటర్వూ్యలో హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌ఆర్సీపై ఆందోళన అక్కర్లేదని, ప్రజల అభిప్రాయాలు స్వీకరించాకే సంబంధిత చట్టం తెస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఉందని, న్యాయ పరీక్షలో సైతం నెగ్గుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు రాజకీయ పార్టీల కుట్రల్లో ఇరుక్కోవద్దని, హింసకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. శుక్రవారం ఆయన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్సీ, దేశవ్యాప్తంగా ఆందోళనలకు సంబంధించిన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు..

ముఖ్యాంశాలు ఇవీ.. 
►పౌరసత్వ చట్ట సవరణ, ఎన్‌ఆర్సీ అంశాలపై దేశవ్యాప్తంగా ఆందోళన విస్తృతమవుతుండటానికి కారణాలేంటి? 
పౌరసత్వ సవరణ చట్టంలో ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి, ఒక భారతీయుడికి గానీ వ్యతిరేకమైన అంశం ఒక్కటీ లేదు. గతంలో మన దేశానికి, పాకిస్తాన్‌కు జరిగిన ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది. అక్కడ మైనారిటీలకు పాకిస్తాన్‌ రక్షణ కల్పించలేదు. సామూహిక మతమార్పిళ్లు, సామూహిక అత్యాచారాలు, మత హింస, మత వివక్ష మరణాలపై పాకిస్తాన్‌ స్పందించలేదు. వారంతా మన దేశానికి శరణార్థులుగా వచ్చి ఇక్కడ 30, 40 ఏళ్లుగా మురికివాడల్లో ఉంటున్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనకు ఉంది.  కొన్ని పార్టీలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ, మతపరంగా ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతాల ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇబ్బంది ఉంటుందనే అన్ని రకాల వెసులుబాట్లు చట్టంలో పొందుపరిచాం. కానీ యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి?

►ఈ చట్టం రాజ్యాంగ లౌకిక భావనలకు విరుద్ధంగా ఉందని, ముస్లింలు అభద్రతకు లోనవుతున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎలా స్పందిస్తారు?  
మన దేశం లౌకిక దేశం. ముస్లింలు ఎవరూ ఈ బిల్లు తమకు వ్యతిరేకమని అనుకోలేదు. పార్టీలే వారిని ప్రేరేపిస్తున్నాయి. చట్టంలో పొందుపరిచిన మూడు ఇస్లామిక్‌ దేశాల్లో ముస్లింలపై వివక్ష ఉండదు. మైనారిటీలే వివక్షకు గురయ్యారు. మన దేశంలో మైనారిటీలైనా, మెజారిటీలైనా గౌరవంగా చూస్తాం. భారత రాజ్యాంగమే మా మతం. రాజ్యాంగ పరిధిలోనే ఈ చట్టాన్ని తెచ్చాం. చొరబాటుదారులకు, శరణార్థులకు మధ్య వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

►శ్రీలంక, నేపాల్‌ వంటి దేశాల్లో కూడా హిందువులు మైనారిటీలుగా ఉన్నారు కదా? 
పాకిస్తాన్‌ నుంచి 40 ఏళ్ల క్రితమే వచ్చి వాళ్లు మురికివాడల్లో ఉంటున్నారు. రక్షిత మంచినీరుకు కూడా వారు నోచుకోలేదు. అక్కడ కనీస మౌలిక వసతుల స్థాపనకు కూడా ఖర్చు పెట్టలేని స్థితి. వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. శ్రీలంక వంటి దేశాల నుంచి వచ్చిన కొన్ని లక్షల మందికి పౌరసత్వం ఇచ్చాం. ఉగాండా నుంచి వచ్చిన హిందువులకు ఇచ్చాం. కానీ పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వారికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మూడు ఇస్లామిక్‌ దేశాల్లో మైనారిటీలుగా ఉండి మత వివక్షకు గురైన వారికి ఇస్తున్నాం తప్ప ఇక్కడ మత వివక్ష లేదు.

►ఈ చట్టాన్ని ఎన్‌ఆర్సీతో కలిపి చూడాలని, హిందువులకు మాత్రమే పౌరసత్వం ఇస్తారని, ఆధారాలు చూపలేని ముస్లింలను వెళ్లగొట్టే పరిస్థితి వస్తుందని వెల్లువెత్తుతున్న ఆందోళనపై మీ స్పందన? 
కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవో సంస్థలు ఈ దిశగా రెచ్చగొడుతున్నాయి. ఎన్‌ఆర్సీ బిల్లు ముసాయిదా కూడా రూపొందలేదు. లేనిది ఊహించుకుని మాట్లాడటం అర్థరహితం.

►శరణార్థులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైతే వారు నష్టపోయే పరిస్థితి ఉండదా? 
గుర్తించడం కష్టమేమీ కాదు. మతం ఆధారంగా, భాష ఆధారంగా గుర్తించొచ్చు. వారి వద్ద ఉన్న ఆధారాలతో గుర్తించొచ్చు. పోలీస్‌ స్టేషన్లలో ఉన్న రికార్డుల ఆధారంగా గుర్తించొచ్చు.

►హిందువులు సహా ఏ ఒక్కరికీ పౌరసత్వం ఇవ్వొద్దని ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. వారికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? 
ఈశాన్య రాష్ట్రాల్లో చాలా రోజులుగా ఈ ఆందోళన జరుగుతోంది. వారి హక్కుల రక్షణకు వీలుగా కొన్ని నిబంధనలు పొందుపరిచాం. వారి సెంటిమెంటును గౌరవించాలన్న ఆలోచనతో ఉన్నాం. అస్సాం ఒప్పందం అమలు కాలేదు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంఘాలతో కమిటీ ఏర్పాటు చేశాం.

►సుప్రీం కోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయ పరీక్షలో ఈ చట్టం నెగ్గుతుందా? 
న్యాయ సమీక్ష మీద నమ్మకం ఉన్నప్పుడు వీధి పోరాటం ఎందుకు? మోదీ ప్రభుత్వం ఎవరి హక్కును కాదనట్లేదు. మా చట్టం న్యాయ పరీక్షలో నెగ్గుతుంది.

►ఈ చట్టం ఒక మతంపై వివక్ష చూపుతోందని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? 
మన నాయకులే దుష్ప్రచారానికి దిగితే బయటివాళ్లు ఎందుకు అనరు?

►ఈ ఉద్యమాలకు, ఆందోళనలకు ముగింపు పలికేందుకు కేంద్ర హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? 
ఆందోళనకారులు, బిల్లుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నవారు మీరు నరేంద్ర మోదీపై ఉన్న కక్షతో ఈ చట్టాన్ని వ్యతిరేకించకండి. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఆందోళనకారులకు ఒకటే విజ్ఞప్తి. ముందు ఒకసారి చట్టాన్ని చదవండి. ప్రశ్నించండి. అంతేగానీ మోదీపై కక్షతో దేశాన్ని ప్రపంచంలో పలుచన చేయొద్దు. పార్టీల కుట్రలో భాగస్వాములు కావొద్దు. బస్సులు తగలబెట్టినా, హింసకు దిగినా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు.

►విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారిని ఎలా శాంతింపజేస్తారు? 
విద్యార్థులు ఆలోచించాలి. వారి ఉద్యమం ఎందుకోసమో? ఎవరికోసమో పునరాలోచించాలి. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు. రాజకీయ పార్టీలు చెప్పాయని గుడ్డిగా ఆందోళనకు దిగొద్దు. మా నుంచి అణచివేత ఎంతమాత్రం లేదు. ఉంటే ఈస్థాయిలో నిరసనలు జరిగేవి కావు. ప్రజాస్వామ్యపద్ధతిలో నిరసనలు చేయండి.

మరిన్ని వార్తలు