బ్లాక్ టికెట్స్ టు మాఫియా డాన్..!

27 Oct, 2015 02:48 IST|Sakshi
బ్లాక్ టికెట్స్ టు మాఫియా డాన్..!

* చోటా రాజన్ నేర ప్రస్థానం
* మొదట దావూద్‌కు కుడిభుజం..
* అనంతరం ప్రధాన శత్రువు
* రెండు దాడుల నుంచి సాహసోపేతంగా తప్పించుకున్న వైనం
* దావూద్ సమాచారమందిస్తూ
* భారతీయ నిఘా సంస్థలకు సహకారం!
 
 సాక్షి, సెంట్రల్ డెస్క్: చోటా రాజన్.. భారత దేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో చెరిగిపోని పేరు. ఎన్నో సినిమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడి సరుకును అందించిన జీవితం. ముంబై శివార్లలోని చెంబూర్ ప్రాంతంలో సహకార్ సినిమాటాకీస్ వద్ద బ్లాక్ టికెట్ల అమ్మకంతో ప్రారంభమైన ఆ 'నానా' నేర జీవితం క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ట్విస్ట్‌లతో.. మతం, దేశభక్తి కోణాలతో ఆసక్తికర మలుపులతో సాగుతుంది.

 1959లో జన్మించిన రాజేంద్ర సదాశివ నికాల్జే సాధారణ మిల్లు కార్మికుడి కొడుకు. చెంబూర్ ప్రాంతంలో బ్లాక్ టికెట్లమ్ముతూ, చోటామోటా నేరాలు చేస్తూ గడుపుతుండేవాడు. స్థానిక దాదా రాజన్ నాయర్ ఉరఫ్ బడా రాజన్ ప్రాపకంలో మరింత రాటు తేలాడు. బడా రాజన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా అక్రమ మద్యం, బంగారం, వెండి స్మగ్లింగ్, బెదిరింపు వసూళ్ల దందా, భూ సెటిల్మెంట్లు తదితరాలతో ముంబై నేర సామ్రాజ్యంలో వేళ్లూనుకున్నాడు. తమిళ డాన్ వరదరాజ ముదలియార్, హైదరాబాదీ గ్యాంగ్‌స్టర్ యాదగిరిలతో సంబంధాలు పెంచుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకున్నాడు. 1983లో బడారాజన్ హత్య అనంతరం ఆ గ్యాంగ్ పగ్గాలు చేపట్టి 'చోటా రాజన్'గా అలియాస్ 'నానా'గా మారాడు. అదే క్రమంలో ముంబైలో అప్పటికే చక్రం తిప్పుతున్న గ్యాంగ్‌స్టర్లు అరుణ్ గావ్లి, దావూద్ ఇబ్రహీంలతో కలిసి క్రిమినల్ యాక్టివిటీస్‌ను తీవ్రం చేశాడు. ముంబై అక్రమ ఆయుధాల వ్యాపారంలో కీలకంగా మారాడు. అదే క్రమంలో దావూద్ ఇబ్రహీంకు బాగా దగ్గరయ్యాడు. అత్యంత సన్నిహితుడిగా పేరొందాడు.


దావూద్‌కు నడిపే డీ కంపెనీలో కీలకంగా మారాడు. 1980ల నాటికి దావూద్‌కు కుడిభుజంగా, ఆయన నేర కార్యకలాపాల్లో, ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్‌లో కీలక శక్తిగా రూపొందాడు. పోలీసుల వేట తీవ్రం కావడంతో అరెస్ట్‌ను తప్పించుకునేందుకు దావూద్ దుబాయి పారిపోయిన సమయంలో డీ కంపెనీ ముంబై కార్యకలాపాలను తానే చేపట్టాడు. స్మగ్లింగ్ వ్యవహారాలను శ్రీలంక, నేపాల్‌ల వరకు విస్తృతం చేశాడు. 1989లో దుబాయిలో అంగరంగ వైభవంగా జరిగిన దావూద్ సోదరుడి వివాహానికి హాజరై... ముంబై పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అక్కడే ఉండిపోయాడు.

 దేశభక్త డాన్‌గా చిత్రీకరణ..: ముంబై పేలుళ్లను వ్యతిరేకించి, దేశభక్త డాన్‌గా రాజన్ తనను తాను చిత్రీకరించుకున్నాడు. ఇండియాలో దావూద్‌ను జాతివ్యతిరేకి, దేశద్రోహిగా చిత్రీకరించడంలో విజయం సాధించాడు. ఈ క్రమంలో శివసేనకు, ఠాక్రేలకు సన్నిహితుడయ్యాడని కూడా అంటుంటారు. మరోవైపు, దావూద్‌కు సంబంధించిన కీలక సమాచారం, దావూద్ నేర వ్యవహరాల వివరాలు అందిస్తూ భారత దర్యాప్తు, నిఘా సంస్థలకు కూడా దగ్గరయ్యాడని సమాచారం. దావూద్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కూడా రాజన్‌కు ఇతోధికంగా సాయపడి అతని ఎదుగుదలకు దోహదపడ్డారు. మరోవైపు, నకిలీ నోట్లు, క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్‌లు, బాలీవుడ్ ఫైనాన్సింగ్ వ్యవహారాల్తో ఆర్థికంగా బలపడ్డాడు. బాలీవుడ్ తారలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు.

 ఎటాక్స్..: ముంబైలో సొంత అస్తిత్వం దెబ్బతింటున్న పరిస్థితులు ఏర్పడటంతో రాజన్ అడ్డు తొలగించుకోవడం దావూద్‌కు అనివార్యమైంది. తన సన్నిహిత సహచరుడు చోటా షకీల్‌కు ఆ బాధ్యత అప్పజెప్పాడు. దాంతో తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో రాజన్ ముంబై కన్నా బ్యాంకాక్ సురక్షితమని భావిం చి, అక్కడికి స్థావరాన్ని మార్చుకున్నాడు. రాజన్ 2000 సంవత్సరంలో రాజన్‌పై మొదటిసారి భారీ ఎటాక్ జరిగింది. బ్యాంకాక్‌లోని రాజన్ స్థావరంలోకి పిజ్జా డెలివరీ బోయ్స్ రూపంలో చోటా షకీల్, మరి కొందరు చొరబడి, రాజన్‌పై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రోహిత్‌వర్మ షార్ప్ షూటర్, రాజన్ సన్నిహితుడు చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఇంటి పై కప్పు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు చోటా రాజన్. ఆకస్మిక దాడి నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకొని.. అనంతరం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. థాయ్ పోలీసుల అరెస్ట్‌ను తప్పించుకునేందుకు హాస్పిటల్ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు.

2003లో ఆ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాడు. బ్యాంకాక్ దాడిలో పాల్గొన్న దావూద్ కీలక అనుచరుడు శరద్ షెట్టీని రాజన్ గ్యాంగ్ దుబాయిలో హతమార్చింది. మరో ఇద్దరు దావూద్ అనుచరులు వినోద్ షెట్టీ, సునీల్ సోవన్‌లను కూడా చంపేశారు. కొన్నాళ్ల తరువాత ఆస్ట్రేలియాలో మారుపేరుతో తలదాచున్నాడు. 2015 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోనూ రాజన్‌పై దాడి చేసేందుకు చోటా షకీల్ వ్యూహం రచించాడు. చోటా రాజన్ అనుచరుడిని తమవైపు తిప్పుకుని, పూర్తి వివరాలు రాబట్టాడు. కానీ, ఈ విషయం ముందే తెలవడంతో, రాజన్ ఆ ప్రాంతం నుంచి సురక్షిత, రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. తాజాగా విహారయాత్ర కోసం ఇండోనేసియాలోని బాలి ద్వీపానికి వెళ్లిన చోటా రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసుల సహకారంతో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేయడంతో రాజన్ క్రైమ్ స్టోరీ క్లైమాక్స్‌కు వచ్చింది. ఇటీవల రాజన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, కిడ్నీలు పనిచేయడంలేదని, నిత్యం డయాలసిస్ తప్పట్లేదన్న వార్తలు వచ్చాయి. దాంతో కావాలనే అరెస్ట్ అయ్యాడన్న వాదనా వినిపిస్తోంది.
 
 1993 ముంబై పేలుళ్లు..
 1992లో దావూద్ ఆదేశాల మేరకు రాజన్ అనుచరులు ముగ్గురిని దావూద్ సన్నిహితుడు సుభాష్ ఠాకూర్ హతమార్చడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమయ్యాయి. అయితే 257 మందిని బలిగొన్న ముంబై వరుస పేలుళ్లను రాజన్ తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. ఆ సీరియల్ పేలుళ్లను రాజన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తద్వారా హిందువుల అనుకూల డాన్‌గా ముద్ర వేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత దావూద్‌ను, దుబాయిని వీడివచ్చేశాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి. సొంత గ్యాంగ్ సహకారంతో ముంబైలో దావూద్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. 1993 నుంచి 2000 దాకా ఆ ఇద్దరి గ్యాంగ్‌వార్‌లో ఇరువర్గాలకు చెందిన వందమందికి పైగా హతమయ్యారు.

మరిన్ని వార్తలు