హాట్‌ వింటర్‌పై ఐఎండీ కీలక అప్డేట్‌ !

1 Dec, 2023 19:53 IST|Sakshi

న్యూఢిల్లీ : గ్లోబల్‌ వార్మింగ్‌తో వాతావరణ మార్పులు కళ్ల ముందు కనిపిస్తునే ఉన్నాయి. ఓ పక్క సీజన్‌తో సంబంధం లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో పక్క శీతాకాలంలోనూ మధ్యాహ్నం వేళల్లో ఎండలు వేడెక్కి‍స్తున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ఒక కీలక అప్డేట్‌ ఇచ్చింది. దేశంలో ఈ శీతాకాలంలో డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు సాధారణంగా కంటే వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 

‘దేశంలో డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు పీక్‌ వింటర్‌గా పరిగణిస్తారు. అయితే ఈ టైమ్‌లో ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంగా కంటే  కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయి. మధ్య, ఉత్తర భారతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి’అని ఐఎండీ డైరెక్టర్‌ మహాపాత్ర తెలిపారు.  

ఇ‍ప్పటికే నవంబర్‌ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐఎండీ ఉష్ణోగ్రతలు రికార్డు చేయడం ప్రారంభించిన 1901 నుంచి గణాంకాలు తీసుకుంటే ఈ ఏడాది నవంబర్‌లో మూడోసారి కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయి కొత్త రికార్డు సృష్టించాయి.  

ఇదీచదవండి.. రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్‌

మరిన్ని వార్తలు