బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

26 Oct, 2018 11:22 IST|Sakshi
యూపీ బీఎస్పీ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

జైపూర్‌ : బ్రిటిష్‌ పాలకులు మరో వందేళ్లు దేశాన్ని పాలించాల్సిందని బీఎస్పీ యూపీ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్‌ వాళ్లు మన దేశాన్ని మరో వందేళ్లు పాలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఎదిగేవారని అన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ను బ్రిటిషర్లు చదువుకునేందుకు అనుమతించకపోతే దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించగలిగే వారు కాదని వ్యాఖ్యనించారు. బ్రిటిష్‌ పరిపాలనలో ఆయనకు చదువుకునే అవకాశం దక్కిందని, వారు లేకుంటే దేశంలో ఏ పాఠశాలలోనూ బాబాసాహెబ్‌కు అడ్మిషన్‌ లభించేది కాదని అన్నారు.

ధరంవీర్‌ వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన నేతలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. బ్రిటిషర్ల పాలనకు గాను మనం రుణం చెల్లించాలని ధరంవీర్‌ భావిస్తే ఆయన బ్రిటన్‌లో శరణార్ధిగా ఉండాలని కొందరు నేతలు సూచించారు.

రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో బిఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ ఏడున జరిగే రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లను టార్గెట్‌ చేసిన బీఎస్పీ వారిని ఆకట్టుకునేందుకు పావులు కదుపుతోంది.

మరిన్ని వార్తలు