క‌రోనా : 3 రోజుల్లోనే.. ల‌క్ష కేసులు

11 Jul, 2020 09:05 IST|Sakshi

ఢిల్లీ : భార‌త్‌లో తొలి క‌రోనా వైర‌స్‌  కేసు జ‌న‌వ‌రి 21న న‌మోదైంది. ఒక్క క‌రోనా కేసు నుంచి లక్ష కేసులు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా అక్కడి నుంచి 7 లక్షలకు కేవలం 49 రోజుల సమయం మాత్రమే తీసుకుంది. అయితే 7 లక్ష‌ల నుంచి 8ల‌క్ష‌లు దాట‌డానికి కేవ‌లం మూడు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. మూడు రోజుల్లోనే ల‌క్ష కేసులు.. భార‌త్‌లో క‌రోనా ఎంత‌లా విజృంభిస్తోంది అని చెప్ప‌డానికి ఇది చాలు. తాజాగా గ‌త 24 గంట‌ల్లో మ‌రో 27 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడ‌డంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల మార్క్‌ను దాటేసింది. (కరోనా కవచ్‌... బీమా కంపెనీల కొత్త పాలసీలు)

రాష్ట్రాల వారిగా చూస్తే అత్య‌ధిక క‌రోనా కేసులతో మ‌హారాష్ట్ర(2,30,599) మొద‌టి స్థానంలో ఉంది. త‌మిళ‌నాడు 1,30, 261 కేసుల‌తో రెండో స్థానంలో, ఢిల్లీ  1,07, 051 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా న‌మోదైన 8ల‌క్ష‌ల పైచిలుకు కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల్ల‌నే 4,67, 911 కేసులు ఉన్నాయి. దేశంలో 70 శాతం కేసులు ఈ మూడు రాష్ట్రాల నుంచి వ‌స్తే, మిగ‌తా 30 శాతం ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉన్నాయి. కాగా దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 21,604 ఉండ‌గా.. 80 శాతం మ‌ర‌ణాలు మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళ‌నాడులోనే ఉన్నాయి.

దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 2,76,685 కాగా, 4,95,512 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 19,138 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 62.42 శాతానికి చేరడం కొంత ఊర‌ట క‌లిగించే అంశం. ఇక క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో నిలిచింది. అగ్ర‌రాజ్యం అమెరికా 32, 46,767 కేసుల‌తో మొద‌టి స్థానం, బ్రెజిల్ 17,62,263 కేసుల‌తో రెండో స్థానంలో ఉన్నాయి.(20రోజుల్లో 3లక్షల కరోనా పరీక్షలు )

కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్‌ యడియూరప్ప కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం/అధికార నివాసాన్ని ఐదు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. శానిటైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత తెరుస్తామని చెప్పారు. దేశంలో కరోనా ప్రబలిన తర్వాత కర్ణాటక సీఎం ఆఫీసును మూసివేయడం ఇది రెండోసారి

క‌రోనా కేసుల‌తో మ‌హారాష్ట్ర‌ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ముంబై త‌ర్వాత పుణెలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు పుణెలో ప‌ది రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పుణెతో పాటు పింప్రి-చించ్వాడ్ లో జులై 13 - 23వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వెల్ల‌డించారు. లాక్ డౌన్ స‌మ‌యంలో కేవ‌లం పాల షాపులు, మెడిక‌ల్ షాపుల‌తో పాటు క్లినిక్స్ మాత్ర‌మే తెరిచి ఉంటాయ‌ని తెలిపారు. ఎమ‌ర్జెన్సీ సేవ‌ల‌కు ఆటంకం క‌లిగించ‌మ‌ని డిప్యూటీ సీఎం స్ప‌ష్టం చేశారు.

త‌మిళ‌నాడులో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల్లో 58.2 శాతం కేసులు రాజ‌ధాని చెన్నై నుంచి న‌మోద‌వుతున్నాయి. అయితే గ‌త 16 రోజులుగా చెన్నైతో పాటు మ‌ధురైలోనూ క‌రోనా కేసులు అంతకంత‌కు పెరుగుతుండ‌డం క‌ల‌వ‌రం పుట్టిస్తోంది.

ఇక ప్ర‌పంచవ్యాప్తంగా చూసుకుంటే అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తుంది. గురువారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు 24 గంట‌ల్లోనే రికార్డు స్థాయిలో 65,551 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5.54 ల‌క్ష‌ల మ‌రణాలు చోటు చేసుకోగా.. కేసుల సంఖ్య కోటీ 22 ల‌క్ష‌లు దాటేసింది.

మరిన్ని వార్తలు