అరుణ్ చిటికేస్తే.. బడా లాయర్ల క్యూ!

13 May, 2017 14:51 IST|Sakshi
అరుణ్ చిటికేస్తే.. బడా లాయర్ల క్యూ!

సోలీ సొరాబ్జీ, హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి.. వీళ్లంతా దేశంలోనే పెద్దపెద్ద లాయర్లు. గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే స్థాయి వాళ్లది. అలాంటి పెద్ద లాయర్లంతా కలిసి ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? ఉత్తరప్రదేశ్‌లో లంచాలతో కోట్లాది రూపాయల సొమ్ము వెనకేసి, లెక్కలేనన్ని నకిలీ బ్యాంకు అకౌంట్లు కలిగిన ఓ అధికారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్‌లో చీఫ్ ఇంజనీర్ అయిన అరుణ్ మిశ్రాను కాపాడేందుకు గత మూడేళ్లుగా సుప్రీంకోర్టులోను, అలహాబాద్ హైకోర్టులోను ఇలాంటి పెద్ద పెద్ద లాయర్లంతా తమ వాదనలు వినిపించారు. ఆయనకు ఎంత పెద్ద జీతం వస్తుందో అనుకుంటాం కదూ.. కానీ అది నెలకు లక్ష రూపాయలు మాత్రమే. ఒక రోజుకు 5 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలుచేసే లాయర్లను మరి ఈయన ఎలా భరిస్తున్నాడంటే.. అంతా లంచాల మహిమ.

2011 సంవత్సరంలో ఈడీ అధికారులు ఢిల్లీ పృథ్వీరాజ్ రోడ్డులోని లూటైన్స్ జోన్, డెహ్రాడూన్ ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై దాడులు చేశారు. పృథ్వీరాజ్ రోడ్డులోని ఆస్తి అజంతా మర్చంట్స్ అనే కంపెనీ పేరుమీద ఉంది. అందులో అరుణ్ భార్య, తండ్రి డైరెక్టర్లు. ఆ భవనం విలువ ఒక్కటే దాదాపు రూ. 300 కోట్లు. యూపీఎస్ఐడీసీ ఇండస్ట్రియల్ పార్కులో కూడా 60 ఎకరాల భూమి ఈయనకు ఉంది. అది కాక, మరో 52 ఎకరాల భూమి మరోచోట ఉంది. కోర్టు రికార్డుల ప్రకారమే చూసినా ఆయనకు, ఆయన కుటుంబానికి కలిపి లక్నో గోమతి రోడ్డులో రెండు బంగ్లాలు, డెహ్రాడూన్‌లో ఐదు ఆస్తులు, బారాబంకిలో 100 ఎకరాల భూమి ఉన్నాయి. 2011 నుంచి ఆయన మీద కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈలోపు ఆస్తుల విలువ మరింత పెరుగుతూ ఉంది. 1986లో యూపీఎస్ఐడీసీలో ఏఈగా చేరిన ఆయన.. 2002లో చీఫ్ ఇంజనీర్ అయ్యారు. ఆయన కంటే సీనియర్లు చాలామంది ఉన్నా, ఈయననే కార్పొరేషన్‌కు ఎండీగా చేశారు. ఫోర్జరీ డిగ్రీలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలతో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2014 ఆగస్టులో ఆయన ఉద్యోగం ఊడిపోయింది. ఆయన ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అప్పట్లో కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు వచ్చేవారు. సుప్రీంకోర్టులో వేర్వేరు దశల్లో సోలీ సొరాబ్జీ, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, గోపాల్ సుబ్రమణ్యం, నాగేశ్వర రావు, శాంతిభూషణ్ తదితరులు వాదించడంతో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో నెల రోజుల్లోనే అరుణ్ మిశ్రా మళ్లీ ఉద్యోగంలో చేరారు.

మరిన్ని వార్తలు