నేడు నింగిలోకి వందో శాటిలైట్‌

12 Jan, 2018 02:49 IST|Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన వందో ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించి 28 గంటల కౌంట్‌డౌన్‌ గురువారం ప్రారంభమైంది. కార్టోశాట్‌–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ సీ–40 ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లనుంది.

ఇందులో మూడు భారత్‌వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు. దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్‌ ఉపగ్రహ వ్యవస్థను 2005లో ప్రారంభించారు. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను ఈ వ్యవస్థ పంపుతోంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, నీటి పంపిణీపై కీలక సమాచారాన్ని సమకూరుస్తోంది. భారత్‌కు చెందిన చివరి ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇప్పటి వరకు ఇస్రో పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య వందకు చేరుతుంది. కౌంట్‌డౌన్‌ సందర్భంగా గురువారం రాకెట్‌కు నాల్గో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం నింపారు.

మరిన్ని వార్తలు