ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!

22 Nov, 2023 13:36 IST|Sakshi

తేల్చిన ఐసీఎంఆర్‌ అధ్యయనం

3645 మంది వివరాల విశ్లేషణ

అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్‌ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్‌ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, క్లుప్తంగా ఐసీఎంఆర్‌).

కోవిడ్‌ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్‌ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. 

కోవిడ్‌ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్‌ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

3645 మంది వివరాలతో...
ఐసీఎంఆర్‌ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు.

ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్‌ అరెస్ట్‌ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడియమాలజీ డైరెక్టర్‌ శాస్త్రవేత్త మనోజ్‌ ముర్హేకర్‌ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్‌ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు.

కోవిడ్‌ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్‌ ముర్హేకర్‌ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. 

రెండు డోసుల టీకాతో రక్షణ...
కోవిడ్‌ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్‌ చెబుతోంది. అయితే కోవిడ్‌-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్‌ కోవ్‌-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్‌ చెబుతోంది.

కోవిడ్‌ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు.
చదవండి: డయాబెటిస్‌ పేషెంట్స్‌.. ఇకపై ఆ బాధ తీరినట్లే

మరిన్ని వార్తలు