చదువుల 'తల్లి'కి 'న్యాయం' తోడు

25 Jun, 2016 21:48 IST|Sakshi
చదువుల 'తల్లి'కి 'న్యాయం' తోడు

విద్య అనే మహా వృక్షం వేర్లు చేదుగానే ఉంటాయి. కానీ అది అందించే ఫలాలు తీయగా ఉంటాయి.. ఈ విషయం బాగా తెలిసిన ఓ తల్లి తన పిల్లలను చదివించేందుకు నానా కష్టాలు పడింది. అయినా శక్తి చాలకపోవడంతో పిల్లల చదువుకోసం కోర్టు మెట్లెక్కింది. ఆమె కష్టాన్ని, పిల్లల్ని చదివించేందుకు ఆమె పడుతున్న తపనను చూసిన న్యాయం గుండె కరిగింది. కఠిన శిక్షలు విధించడమే కాదు, కరుణను కూడా చూపించగలమని ధర్మాసనం రుజువు చేసింది. ఇంతకీ ఇది ఎవరి కథ? ... ఇది కథ కాదు, పిల్లల చదువు కోసం ఓ తల్లి చేసిన పోరాటం. అదేంటో ఓసారి మీరే చదవండి.

పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించాలని, వారు ఇంగ్లిష్ మాట్లాడుతుంటే విని మురిసిపోవాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. మరి ఈ రోజుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులంటే మాటలా? డొనేషన్, మంత్లీ ఫీజు, బిల్డింగ్ ఫీజు, టర్మ్ ఫీజు అంటూ ఎల్‌కేజీకే లక్షలు వసూలు చేస్తున్న రోజులివి. డబ్బున్నవారు వీటిని భరిస్తారు. సామాన్యులైతే ఉన్నదేదో అమ్ముకొని చదివిస్తారు. మరి పేదలు, మురికివాడల్లో ఉంటున్నవారికి కాన్వెంట్ చదువు అందని ద్రాక్షేనా? పేదల కడుపున పుట్టిన పాపానికి ఆ పిల్లలు ఏదో ఓ పనిచేసుకుంటూ బతకాల్సిందేనా? ... తన పిల్లలకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదనుకుంది ముంబైకి చెందిన రీటా కనోజా.

చుట్టూ కష్టాలే, చదువే పరిష్కారం..
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో లోకమాన్య తిలక్ హైస్కూల్ ఉంది. దానికి పక్కనే ఓ మురికి వాడలో రీటా ఉంటోంది. చుట్టుపక్కల ధనికుల ఇళ్లల్లో పనిచేసి, వచ్చే డబ్బుతో ఇద్దరు కూతుళ్లను లోకమాన్య తిలక్ హైస్కూల్‌లోనే చదివిస్తోంది. భర్త లాండ్రీ షాపు నడిపేవాడు. అకస్మాత్తుగా క్యాన్సర్‌తో మరణించాడు. దీంతో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పిల్లలిద్దరిని ఎలాగోలా చదివించినా మూడోవాడైన కొడుకు పరిస్థితి ఏంటి? వాణ్ని కూడా బాగా చదివించాలనేది ఆమె కోరిక. దీంతో కూతుళ్లు చదువుతున్న పాఠశాలలోనే వాణ్నీ చదివించాలనుకుంది. కానీ పాఠశాల యాజమాన్యం ఫీజు మొత్తం ఒకేసారి కట్టాలన్నారు. నెలనెలా కడతామని చెప్పినా పట్టించుకోలేదు. మరోసారి స్కూళ్లోకి అడుగు పెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో చేసేది లేక రీటా కోర్టు మెట్లెక్కింది.

తోడుగా నిలిచిన న్యాయం..
బాంబే హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది. రీటా పరిస్థితినంతా న్యాయమూర్తి వీఎం కనడే శ్రద్ధగా విన్నారు. నెలనెలా ఫీజు తీసుకునేందుకు అంగీకరించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. అలా కుదరని పక్షంలో తన జేబులోనుంచి ఫీజు చెల్లిస్తానని చెప్పారు. దీనిపై పాఠశాల స్పందన ఏంటో 27వ తేదీలోగా చెప్పాలని ఆదేశించాడు. కేసు తదుపరి విచారణ రేపు జరగనుంది.
 

మరిన్ని వార్తలు