పరీక్షలు చేయించుకోకపోతే.. హత్యాయత్నం కేసు..

7 Apr, 2020 04:56 IST|Sakshi

జాతీయ భద్రతా చట్టం 

తబ్లిగీ జమాత్‌ సభ్యులకు యూపీ అధికార వర్గాల హెచ్చరిక  

కాన్పూర్‌/గువాహటి: తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొని, కరోనా వైరస్‌ పరీక్ష చేయించుకోకుండా మొండికేస్తున్న వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోపాటు కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని(ఎన్‌ఎస్‌ఏ) సైతం ప్రయోగిస్తామని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. దేశంలో ఇప్పటికే బయటపడ్డ 4,069 కరోనా పాజిటివ్‌ కేసుల్లో కనీసం 1,445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధించినవేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదు. వారు ఇప్పటికైనా ముందుకు రావాలని, ఇదే చివరి అవకాశమని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ చెప్పారు. పరీక్షల కోసం రాకపోతే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని, వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని తేల్చిచెప్పారు. తబ్లిగీ జమాత్‌ సభ్యులతోపాటు వారిని కలిసినవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఏ ప్రకారం.. ఒక వ్యక్తిని 12 నెలల వరకు నిర్బంధించవచ్చు. తబ్లిగీ జమాత్‌ సభ్యులు సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని ఉత్తరాఖండ్‌ డీజీపీ అనిల్‌కుమార్‌ రాతూరీ స్పష్టం చేశారు.  

25,500 మంది తబ్లిగీ సభ్యుల క్వారంటైన్‌
ఇప్పటిదాకా 25,500 మందికిపైగా తబ్లిగీ జమాత్‌ సభ్యులను, వారితో సంబంధం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించినట్లు హోంశాఖ సీనియర్‌ జాయింట్‌ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ వెల్లడించారు. హరియాణాలో ఐదు గ్రామాలను పూర్తిగా దిగ్బంధించి, అక్కడి ప్రజలందరినీ క్వారంటైన్‌ చేశామన్నారు. తబ్లిగీకి చెందిన విదేశీ సభ్యులు ఆయా గ్రామాల్లో తలదాచుకున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 2,083 మంది విదేశీయుల్లో ఇప్పటివరకు 1,750 మందిని బ్లాక్‌లిస్టులో చేర్చామన్నారు.

>
మరిన్ని వార్తలు