మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులకు ఉభయసభలు ఆమోదం

21 Dec, 2023 20:46 IST|Sakshi

సాక్షి న్యూఢిల్లీ: మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లుకు గురువారం పెద్దల సభలో ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించగా.. నేడు రాజ్యసభలో హోమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. తాజాగా పెద్దల సభలోనూ ఆమోదం లభించడంతో రాష్ట్రపతి ఆమోదం అనంతరం త్వరలోనే చట్టరూపం దాల్చనున్నాయి. బ్రిటిష్ కాలంనాటి  ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.

పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష బిల్లులకు పార్లమెంట్ ఆమోదం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ బిల్లులతో బ్రిటిష్ చట్టాలకు చెల్లు చీటీ పాడి.. ప్రజా సంక్షేమం, సేవలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సంస్కరణలు తీసుకురావాలన్న తమ సంకల్పానికి ఈ బిల్లులు ఒక సంకేతమని చెప్పారు.

ఈ కొత్త బిల్లులతో పోలీసింగ్, దర్యాప్తు విధానాలలో మరింత సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగిస్తారని మోదీ పేర్కొన్నారు. ఈ బిల్లులతో పేదలకు అణిచివేతకు గురైన వర్గాలకు రక్షణ దొరుకుతుందదని.. అదే సమయంలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై, ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతుందని తెలిపారు. రాజద్రోహం చట్టాలకు ముగింపు పలికామని అన్నారు.

ఇక రాజ్యసభలో క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి సమాధానమిచ్చారు. కొత్త చట్టాలు కేవలం శిక్షలు విధించడమే మాత్రమే కాకుండా న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. పేదలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టాలు దోహదపడతాయన్నారు.

అనంతరం రాజ్యసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ప్రకటించారు. అయితే షెడ్యూల్‌కు ఒక రోజు ముందే లోక్‌సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా పడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సెషన్ లో 146 మంది వివక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
చదవండి: రాహుల్‌పై చర్యలు తీసుకోండి.. ఈసీకి హైకోర్టు ఆదేశం

>
మరిన్ని వార్తలు