వైరల్‌ ఫోటో : క్షమాపణలు చెప్పిన నేత

4 Oct, 2018 09:10 IST|Sakshi
2018 కిసాన్‌ క్రాంతి యాత్రకు సంబంధించినదిగా చెప్పబడుతున్న 2013 నాటి మహాపంచాయత్‌ ఫోటో

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో ఏదైనా అంశం వైరల్‌గా మారితే చాలు.. అది వాస్తవమో.. కాదో తెలుసుకోకుండానే దాన్ని మరో నలుగురికి షేర్‌ చేయడం.. దాని గురించి తోచిన కామెంట్‌ పెట్టడం.. ఆనక అది కాస్తా వాస్తవం కాదని తెలిశాక క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురయ్యింది సీపీఐ(ఎమ్‌ఎల్‌) నేత కవితా కృష్ణన్‌కి.

మంగళవారం ‘గాంధీ జయంతి’ సందర్భంగా తమ సమస్యల పరిష్కారానికి రైతులు ‘కిసాన్‌ క్రాంతి యాత్ర’ చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ యాత్రను అడ్డుకోవాడానికి పోలీసులు రైతుల మీద లాఠీచార్జీ చేశారు. ఈ దాడికి సంబంధించినదిగా భావిస్తున్న ఒక ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఈ ఫోటోలో భద్రతా అధికారి, ఓ రైతును అడ్డగించాడానికి తుపాకీతో బెదిరిస్తుండగా.. సదరు ముసలి రైతు ఏమాత్రం బెదరక ఓ చేతిలో ఇటుక, మరో చేతిలో లాఠీ పట్టుకుని అధికారి మీదే దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది ఫోటోలో.

ఈ ఫోటోను కవితా కృష్ణన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడమే కాకుండా ‘ఈ ఫోటోలో ఆగ్రహంతో ఊగిపోతూ భద్రతాధికారి మీదకు రాయి ఎత్తిన ఈ రైతును ఉగ్రవాది అనలేమో అదే విధంగా ఉగ్రవాదుల మీద రాళ్లతో దాడి చేసే కశ్మీరి బాలలను కూడా ఉగ్రవాదులగా పరిగణించరాదు’ అంటూ ట్వీట్‌ చేశారు. కవిత చేసిన ట్వీట్‌ను దాదాపు 2500 మంది రిట్వీట్‌ కూడా చేశారు. అయితే కవిత ఈ ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేసిన తరువాత దీనికి సంబంధించి అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది.

అది ఏంటంటే ఈ ఫోటో ‘కిసాన్‌ క్రాంతి యాత్ర’కు సంబంధించనది కాదని, అసలు ఈ మధ్య కాలంలో తీసినది కాదని తెలిసింది. ఈ ఫోటో దాదాపు ఐదేళ్ల క్రితం 2013 మీరట్‌, ఖేరా గ్రామంలో మహాపంచయత్‌ గొడవల సందర్భంగా తీసిందిగా నిర్ధారించబడింది. దాంతో ట్విటర్‌ జనాలు కవితను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ఇలా ట్రోల్‌ చేసిన వారిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ రెబల్‌ కపిల్‌ మిశ్రా కూడా ఉన్నారు. ఆయన ఈ ఫోటోతో పాటు దీనికి సంబంధించిన కథనాన్ని కూడా స్క్రీన్‌ షాట్‌ తీసి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

అసలు విషయం తెలుసుకున్న కవితా కృష్ణన్‌ తన పొరపాటును గుర్తించి క్షమాపణలు చెప్పారు. కానీ తాను వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మాత్రం సమర్ధించుకున్నారు.

మరిన్ని వార్తలు