ముంబై శ్మశానంలో ‘చైతన్య ఝరి’!

11 Dec, 2017 03:25 IST|Sakshi

ముఖ్యఅతిథిగా తనికెళ్ల భరణి  

సాక్షి, ముంబై: ముంబై నగరంలోని డా.బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సమాధి ‘చైత్య భూమి’ సమీపంలోని శ్మశానంలో ఆదివారం తెలుగు కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవి, నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ‘చైతన్య ఝరి’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు అంబేడ్కర్‌ జీవితంపై, మనిషి జన్మపై, తెలుగు భాషపై కవితలు వినిపించారు. తనికెళ్ల భరణి వినిపించిన కవులు–కౌలు అనే కవితతో పాటు ఆయన ఆలపించిన ‘ఆటగదరా శివా.. ఆట కదా కేశవా’అనే శివ తత్వాలు అలరించాయి. మనిషిలోని అహం పూర్తిగా సమసిపోయేది శ్మశానంలోనేననీ, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన కవులు ముందుగా తమలోని అహాన్ని విడనాడాలనే సత్సంకల్పంతో శ్మశానంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశామని సాహిత్య విభాగ ఉపాధ్యక్షుడు సంగెవేని రవీంద్ర చెప్పారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ మనవడు ఆనంద్‌రాజ్, పొన్నూరి భారత లక్ష్మి, నడిమెట్ల యెల్లప్ప, ఆంధ్ర మహాసభ ట్రస్టీలు వాసాల శ్రీహరి, మహిళా శాఖ కార్యదర్శి సోమల్‌ లత పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు