దేదీప్యమానం.. అయోధ్యా నగరం! ఫొటోలను షేర్‌ చేసిన ప్రధాని మోదీ

12 Nov, 2023 20:24 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో సరయూ నదీతీరంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవం అమోఘమని, దైవీకమని, కళ్లలో చెరిగిపోనిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేత్రపర్వమైన ఆ దీపోత్సవ దృశ్యాలను తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో పంచుకున్నారు.

అయోధ్యలో వెలిగించిన లక్షలాది దీపాల వెలుగులో దేశమంతా కాంతులీనుతోందన్నారు. ‘ఈ దీప కాంతుల నుంచి వెలువడే శక్తి దేశమంతటా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ శ్రీ రాముడు దేశ ప్రజలందరికీ సుభిక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్‌’ అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్‌ చేశారు.

అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం 22 లక్షల దీపాలతో అత్యంత వైభవంగా జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా తన గిన్నిస్‌ రికార్డును తానే బద్దలుకొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు.

మరిన్ని వార్తలు