పోలీసులకు చిక్కకుండా ఫొటోలకు పోజులు

27 Jul, 2016 18:27 IST|Sakshi
పోలీసులకు చిక్కకుండా ఫొటోలకు పోజులు

లక్నో: ఓ పక్క బూట్లు అరిగేలా పోలీసులు బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ జాడ కోసం గాలింపులు జరుపుతుండగా ఆయన మాత్రం దర్జాగా ఫొటోలకు పోజులిస్తున్నారు. జార్ఖండ్ లో ఓ ఆలయం వద్ద మొక్కులు చెల్లిస్తూ ఉన్న ఫొటోలు బయటకు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన జార్ఖండ్లో కొందరు బీజేపీ నేతలతో కలిసి ఆయన దర్జాగా నవ్వుకుంటూ పూజలు చేస్తూ కనిపించడం గమనార్హం. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ దళితుల ఓట్లు కొల్లగొట్టాలని వ్యూహం రచించగా దయాశంకర్ బీఎస్పీ అధినేత్రి మాయావతిని తీవ్ర పదజాలంతో దూషించి అబాసు పాలైన విషయం తెలిసిందే.

అతడి వ్యాఖ్యలతో బీజేపీకి తీరని నష్టం జరిగింది. దీంతో ఆ పార్టీ అతడిని బహిష్కరించి ఆరేళ్లు దూరం పెట్టింది. దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన దయాశంకర్ ను వెంటనే అరెస్టు చేయాలని ముక్తకంఠంతో దళితులు నినదించిన నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు. కానీ, అతడు మాత్రం వారికి చిక్కడం లేదు. కేసు నమోదై వారం గడుస్తున్నా ఆయన మాత్రం ఇలా పోలీసుల కళ్లు గప్పి ఏం చక్కా చక్కెర్లు గొడుతున్నారు. తాజాగా బయటకొచ్చిన ఈ ఫొటోల కారణంగా మరోసారి దళితులు ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు