ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు

9 Jan, 2020 06:06 IST|Sakshi

దీపికాకు కేంద్రం అండ

న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీకి వెళ్లినందుకు గాను దీపికా పదుకొనే రాబోయే చిత్రం చపాక్‌ను ఎవరూ చూడొద్దని బీజేపీలో కీలక నేతలు సహా ఎందరో పిలుపునిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకి అండగా నిలిచింది. ప్రజాస్వామ్య భారత్‌లో నటీనటులే కాదు సామాన్యులెవరైనా ఎక్కడికైనా వెళ్లి తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పవచ్చునని పేర్కొంది. ఏదైనా అంశంపై ఎవరైనా అభిప్రాయాలు చెబితే ఎవరికీ అభ్యంతరం ఉండదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బుధవారం విలేకరులతో చెప్పారు.

దీపిక చిత్రాన్ని బహిష్కరించాలని కొందరు బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయంపై విలేకరులు జవదేకర్‌ను ప్రశ్నించగా, తన దృష్టికి అలాంటివేమీ రాలేదని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని, అదే విధంగా అ«ధ్యాపకుల్ని విశ్వాసంలోకి తీసుకోవాలని జేఎన్‌యూ వీసీ జగదీశ్‌ కుమార్‌కు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ సూచించింది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్‌ పెయింట్‌ పూసుకొని గాయాలైనట్టు నాటకమాడిందని  పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు.  

నిందితుల గురించి కీలక ఆధారాలు  
జేఎన్‌యూలో దాడికి దిగిన ముసుగు దుండగులకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. త్వరలోనే వారు నిందితుల్ని గుర్తిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాంపస్‌లోకి బుధవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని వార్తలు