ఢిల్లీ కూల్చివేతలకు రాజకీయరంగు

15 Dec, 2015 03:08 IST|Sakshi
ఢిల్లీ కూల్చివేతలకు రాజకీయరంగు

శిశువు మృతిపై కేసు నమోదు
షకూర్ బస్తీ ఘటనపై కేంద్రం, రాహుల్‌పై ఆప్ సర్కారు ధ్వజం  

 
 న్యూఢిల్లీ: ఢిల్లీలోని షకూర్ బస్తీలో రైల్వే ట్రాకుల పక్కన రెండు రోజుల కిందట ఆక్రమణలు తొలగిస్తుండగా ఓ శిశువు మృతిచెందిన సంఘటన రాజకీయ  దుమారం సృష్టిస్తోంది. మృతిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు.. కేంద్రంతోపాటు అటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తింది. ఈ ఘటనకు కేజ్రీవాల్ , మోదీ సర్కార్లదే బాధ్యతని, అవి బాధితులకు పునరావాసం కల్పించకుండా పరస్పర విమర్శలకు దిగుతున్నాయని రాహుల్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించారు.

కాగా రాహుల్ ఇంకా పిల్లాడిలాగే వ్యవహరిస్తున్నారని, రైల్వేలు కేంద్రం పరిధిలోకి వస్తాయన్న విషయం ఆయనకు తెలియదా? అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. పాప మృతిపై ఆప్ సర్కారు న్యాయవిచారణకు ఆదేశించింది. కేజ్రీవాల్, రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలిశారు.  పునరావాసం కల్పించకుండా ఢిల్లీలో ఇకపై మురికి వాడల తొలగింపు ఉండదని కేజ్రీ మీడియాతో అన్నారు. మరోపక్క.. ఛాతీపై తీవ్రగాయాలు, పక్కటెముకలు విరగడం వంటి కారణాలతో ఆరు నెలల శిశువు మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది.

బస్తీలో ఆక్రమణల తొలగింపు ప్రారంభించడానికి రెండు గంటల ముందే ఆ శిశువు మృతిచెందినట్టు ప్రభు లోక్‌సభకు చెప్పారు. అధికారుల చర్యవల్లే తమ పాప మృతిచెందిందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే హడావుడిలో బట్టలమూట పాపపై పడడంతో మృతిచెందినట్లు పాప తండ్రి  పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కూల్చివేత విషయంలో రైల్వే శాఖపై, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది.  గూడు కోల్పోయిన 5 వేల మందికి వెంటనే పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు