నెలసరి లీవ్‌ అవసరం లేదు

15 Dec, 2023 04:31 IST|Sakshi

అది వైకల్యం కాదు 

స్మృతి ఇరానీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్‌లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్‌ లీవ్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్‌(యూ) సభ్యుడు మనోజ్‌ కుమార్‌ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు.

‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్‌ లీవ్‌ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్‌ లీవ్‌ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు