ఢిల్లీలో మరో దారుణం : చిన్నారిపై అఘాయిత్యం

11 Sep, 2018 17:25 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. తాను చదువుకుంటున్న స్కూల్‌లోనే మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఓ వైపు వైద్య పరీక్షలు లైంగిక దాడి జరిగినట్టు ధృవీకరించినప్పటికీ, స్కూల్‌ యాజమాన్యం మాత్రం అసలేం జరగలేదంటూ వాదిస్తోంది. పాపపై జరిగిన అఘాయిత్యంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ, వారు సైతం బెదిరింపులకు దిగారు. దీంతో తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ ద్వారా పోరాటం చేస్తున్నారు. 

గత వారం స్కూల్‌లో తన కూతురిపై అత్యాచారం జరిగిందని, ఎవరూ తమకు న్యాయం చేయడం లేదని ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో ‘ప్లీజ్‌ మాకు సాయం చేయండి’ అని పాప తల్లి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటోంది. స్కూల్‌ నుంచి వచ్చిన తన కూతురి పాంటీస్‌లో రక్తపు మరకలు కనిపించాయని, వెంటనే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తే, ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసిందని తల్లి చెప్పారు. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుందని తెలిపారు. స్నానానికి తీసుకెళ్లినప్పుడు కూడా ప్రైవేట్‌ పార్ట్‌ల్లో నొప్పి వస్తుందని ఏడుస్తుందన్నారు. ఈ విషయంపై పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయద్దంటూ పోలీసులు తమల్ని బెదిరించారని తెలిపారు. తాము ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు. 

అంతేకాక స్కూల్‌కు పోలీసులు క్లీన్‌ చీట్‌ ఇచ్చారని, స్కూల్‌ ముగిసే సమయం వరకు అలాంటి సంఘటనలేమీ జరుగలేదని తేల్చారు. ఏం జరిగినా అది ఇంటి వద్దనే జరిగిందంటూ తమపైనే నిందలేసినట్టు ఈ వీడియోలో తండ్రి తెలిపారు. స్కూల్‌లో ఉన్న అన్ని సీసీటీవీలను తాము పరిశీలించామని, అలాంటి సంఘటనలేమీ వాటిలో నమోదు కాలేదని పోలీసులు చెప్పినట్టు పేర్కొన్నారు. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యంపై పాప తల్లిదండ్రులు, వారి బంధువులు, చుట్టుపక్కల వారు స్కూల్‌ ఎదుట నిరసనకు దిగారు. ఈ సంఘటనపై న్యాయమైన విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సైతం తమ పాఠశాలలో అలాంటి సంఘటనేమీ జరుగలేదంటూ వాదిస్తున్నారు. అంతకముందు ఈ స్కూల్‌లో ఇలాంటివే రెండు సంఘటనలు జరిగాయి.‘ప్లీజ్‌ మాకు సాయం చేయండి. మేము చాలా ఆందోళన చెందుతున్నాం. మాకు ఏమొద్దు కానీ న్యాయం చేయండి. మాపై బెదిరింపులకు కూడా దిగుతున్నారు’ అని వీడియోలో తల్లిదండ్రులు చెప్పారు. ‘ఈ రోజు మా కూతురికి జరిగింది, రేపు మీకు ఇదే జరగవచ్చు’ అంటూ పాప తల్లి కన్నీరుమున్నీరైంది.   
 

మరిన్ని వార్తలు