రాహుల్‌ గాంధీకి చుక్కెదురు

11 Sep, 2018 03:17 IST|Sakshi

హెరాల్డ్‌ కేసులో పన్ను వివరాల పునఃతనిఖీకి హైకోర్టు అనుమతి

న్యూఢిల్లీ: 2011–12 ఆర్థిక సంత్సరంలో తాము చెల్లించిన పన్నుల వివరాలను మరో సారి తనిఖీ చేయకుండా అడ్డుకోవాలంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో ఆ ఏడాదిలో గాంధీలతోపాటు కాంగ్రెస్‌ నేత ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లు చెల్లించిన పన్నుల వివరాలను ఆదాయపు పన్ను విభాగం అధికారులు మరోసారి తనిఖీ చేసి పన్ను ఎగవేతల విషయాన్ని తేల్చనున్నారు.

కాంగ్రెస్‌కు చెందిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నడుపుతున్న అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) కంపెనీని యంగ్‌ ఇండియా (వైఐ) అనే సంస్థ కొనుగోలు చేసింది. 2011–12 ఏడాదికి రాహుల్‌ రూ. 68 లక్షల ఆదాయానికే పన్ను చెల్లించగా ఆయనకు వైఐలో ఉన్న వాటాల ద్వారా రూ. 154 కోట్ల ఆదాయం వచ్చిందని గతంలో అంచనా వేసింది. ఏజేఎల్‌ నుంచి తమ వాటాలను వైఐకి బదిలీ చేసే సమయంలో గాంధీలతోపాటు ఫెర్నాండెజ్‌ అవకతవకలకు పాల్పడి పన్ను తక్కువగా కట్టారనేది ఆరోపణ. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా స్పందిస్తూ ప్రధాని మోదీకి ధైర్యముంటే రాహుల్‌ను, కాంగ్రెస్‌ను రాజకీయ యుద్ధంలో ఎదుర్కోవాలనీ, ఆదాయపు పన్ను విభాగం వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి కాదని విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు