రాష్ట్రానికి మరో 45 మంది ఐఏఎస్‌లు

14 May, 2016 06:49 IST|Sakshi

- కేటాయించిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం
- ప్రస్తుతమున్న 163 మంది కోటా 208కి పెంపు
- వరుసగా చేసిన విజ్ఞప్తులకు స్పందించిన కేంద్రం
- ఇక ఐఏఎస్‌ల కొరత తీరినట్టే
- కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం మరింత సుగమం
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత తీరింది. ఐఏఎస్‌ల కేడర్‌ను సమీక్షించిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) తెలంగాణకు 45 మంది ఐఏఎస్ అధికారులను అదనంగా కేటాయిం చింది. ఈ మేరకు తుది కేటాయింపుల వివరాలతో డీవోపీటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు నిర్దేశించిన ఐఏఎస్ కోటా 163. ప్రస్తుతం ఈ సంఖ్యను 208కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడున్నదానితో పోలిస్తే అదనంగా 30 శాతం కోటా పెరిగినట్లయింది.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అవసరం మేరకు అఖిల భారత సర్వీసు అధికారులను ఇవ్వాలంటూ ఏడాదిన్నరగా తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఐఏఎస్ అధికారుల కొరతతో కొత్త రాష్ట్రం సతమతమవుతోందని, పాలనాపరంగా  బ్బందులు ఎదురవుతున్నాయని పలుమార్లు డీవోపీటీ దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీని కలిసిన సందర్భంలోనూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీంతో డీవోపీటీ జనవరిలోనే సీఎస్ రాజీవ్‌శర్మను ఢిల్లీకి పిలిపించి వివరాలను సేకరించింది. అదే సందర్భంగా రాష్ట్ర కేడర్‌ను సమీక్షించేందుకు నిర్ణయం తీసుకుంది.

హోదాల వారీగా కేడర్ ఇలా..
తుది కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వుల్లో ఐఏఎస్‌కు నిర్దేశించిన శాఖలవారీ హోదాలపైనా డీవోపీటీ స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో చీఫ్ సెక్రెటరీతోపాటు ఇద్దరు స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, 16 మంది ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు, 18 మంది కార్యదర్శి స్థాయి, 19 మంది కమిషనర్ స్థాయి అధికారులు, 10 మంది కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్లు, 21 మంది డెరైక్టర్లు, ఐదుగురు ప్రాజెక్టు డెరైక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లుగా ముగ్గురు, స్పెషల్ కలెక్టర్(ఐఅండ్‌కాడ్)గా ముగ్గురు, తెలంగాణ విజిలెన్స్ డిపార్టుమెంట్‌కు ఒక పోస్టు, టీఎస్‌పీఎస్సీకి ఒకటి, ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవోగా ఒక పోస్టు, సీసీఎల్‌ఏ కార్యదర్శిగా ఒక పోస్టు, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్‌గా ఒక పోస్టును నిర్దేశించింది. వీరితో పాటు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై 45 మంది ఐఏఎస్‌లు, స్టేట్ డిప్యుటేషన్‌పై 28 మంది ఐఏఎస్‌లు, రిజర్వు ఫర్ ట్రైనింగ్‌కు ముగ్గురు, రిజర్వ్ ఫర్ లీవ్‌గా 18 మందిని పరిగణించింది. వీరితోపాటు 63 మంది కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఉంటారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఊతం
కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఐఏఎస్‌ల కోటా పెంపు కలిసొచ్చినట్లయింది. అదనంగా ఐఏఎస్‌లను కేటాయించనుండటంతో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల కొరత తీరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వివిధ శాఖల్లో ఉన్న ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల పోస్టులు భర్తీ కానున్నాయి. కీలకమైన శాఖలను ఇన్‌చార్జిలతో నెట్టుకు వచ్చే పరిస్థితి కాస్తా మెరుగుపడనుంది. కానీ కేంద్రం సీనియర్ ఐఏఎస్ అధికారులను కేటాయించకపోవడం గమనార్హం. దీంతో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు సొంత రాష్ట్రానికి సేవలందించే వెసులుబాటు కల్పించటం, కొత్తగా వచ్చే ఏఐఎస్ కోటాను కేటాయించడం ద్వారా అదనపు కోటాను భర్తీ చేసే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పుడున్న ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించి కేడర్ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

స్పెషల్ సీఎస్‌లుగా ఎస్‌కే జోషి, రేమండ్ పీటర్?
ప్రస్తుతం ముఖ్య కార్యదర్శుల హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు రేమండ్ పీటర్, శైలేంద్ర కుమార్ జోషి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్ పొందనున్నారు. శుక్రవారం సీఎస్ రాజీవ్ శర్మ సారథ్యంలో జరిగిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కౌన్సిల్(డీపీసీ) ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఫైల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపింది. ప్రస్తుతం జోషి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తుండగా.. రేమండ్ పీటర్ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా ఉన్నారు.

మరిన్ని వార్తలు