తెలంగాణలో కన్నడ కాక! 

20 Nov, 2023 04:22 IST|Sakshi

ఆ రాష్ట్రం చుట్టూ తిరుగుతున్న ప్రచారం 

మరో రాష్ట్రం కీలక ప్రచారాంశం కావటం ఇదే తొలిసారి 

తెలంగాణతో పెద్దగా కాంటాక్ట్స్‌ లేకున్నా... ఇప్పుడు బీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌ మధ్య కాక రేపిన పొరుగు రాష్ట్రం 

కర్ణాటక తరహాలో ‘గ్యారంటీ’లను అమలు చేస్తామంటూ జనంలోకి కాంగ్రెస్‌ 

స్వయంగా వచ్చి విజయగాథలు వినిపిస్తున్న కర్ణాటక ప్రభుత్వ పెద్దలు 

అక్కడి హామీల అమలు తుస్సుమన్నదని ఎదురుదాడికి దిగిన బీఆర్‌ఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కన్నడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎన్నికల ప్రచారం కర్ణాటక ప్రధాన అంశంగా సాగుతుండటం ఆసక్తి రేపుతోంది. రెండు ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌లు పొరుగు రాష్ట్రం పాలనను ప్రచారంలోకి తెచ్చి హోరెత్తిస్తున్నాయి.

ఇది గతంలో ఎన్నడూ కనిపించని వ్యవహారం. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో పార్టీల మధ్య వేరే రాష్ట్రం అంశం కేంద్రబిందువుగా నిలవలేదు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అంశం ప్రస్తావనకు వచ్చినా, అది రాష్ట్ర విభజన అంశాలకే పరిమితమైంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో మరో రాష్ట్రం ప్రచారాంశంగా నిలవలేదనే చెప్పాలి. కానీ తొలిసారి పొరుగు రాష్ట్రం ఇక్కడి రాజకీయ పరిస్థితిని హీటెక్కించింది. 

అక్కడ గెలుపు.. ఇక్కడ ఊపు 
గతేడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించిన దరిమిలా తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపొచ్చింది. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేది బీజేపీనే అన్న భావన ఉండగా, కర్ణాటక ఫలితాలు ఒక్కసారిగా పరిస్థితిని మార్చేశాయి. దీనికి తోడు బీజేపీలో అంతర్గతంగా నెలకొన్న కొన్ని పరిస్థితులు కూడా కాంగ్రెస్‌లో ఊపు పెరిగేందుకు కారణమయ్యాయి. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్‌ ప్రచార తీరును కూడా మార్చేశాయి.

అప్పటి వరకు కేంద్రప్రభుత్వ విధానాలు, ప్రధాని మోదీ తీరును టార్గెట్‌ చేస్తూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ రాగా.. ఆ తర్వాత నుంచి వారి దాడి కాంగ్రెస్‌ వైపు మళ్లింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటూ, స్థానిక నేతల తీరును ఎండగడుతూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత ఒక్కసారి బీఆర్‌ఎస్‌ దాడి మరింత తీవ్రమైంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ప్రభుత్వ పాలన తీరును వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లటం ప్రారంభించింది. 

ప్రజల ముందుకు కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు 
కాంగ్రెస్‌ పార్టీ తన ప్రధాన హామీలైన ‘ఆరు గ్యారంటీ’లను  మిగతా పార్టీల కంటే చాలా ముందుగానే  ప్రజల ముందుంచింది. రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌ అందించే ‘మహాలక్ష్మి’ పథకం,  రైతులకు ఎకరానికి రూ.15 వేలు అందించే రైతు భరోసా, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించే గృహజ్యోతి, పేదలకు గృహవసతి కల్పించే ఇందిరమ్మ ఇంటి పథకం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చే యువ వికాసం, రూ.4 వేల నెలవారీ పింఛన్‌తో కూడిన చేయూత.. ఇలా ఆరు గ్యారంటీలను ప్రకటించింది.

కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి నేతలు ఐదు గ్యారంటీలను ప్రకటించి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేయడం ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో గ్యారంటీల అమలు అద్భుతంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు వివరించటం ద్వారా, తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని నమ్మకం కలిగించే ప్రయత్నం ప్రారంభించారు.   

అక్కడి నేతలతో కాంగ్రెస్‌కు ప్రచార బలం 
హామీలపై మరింత భరోసా కలిగించేందుకు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను తీసుకొచ్చి ప్రచారంలో పాల్గొనేలా చేశారు. ఈ తీరు కాంగ్రెస్‌ ప్రచారానికి పెద్ద బలం చేకూర్చింది. దీనిని గుర్తించిన బీఆర్‌ఎస్‌ నేతలు వెంటనే ప్రతిస్పందించారు. కర్ణాటక అంశాన్ని తిప్పిగొట్టడం ప్రారంభించారు.

కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా అక్కడి కాంగ్రెస్‌ నేతలు అలవిగాని హామీలు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయలేక చతికిలబడుతున్నారంటూ కాంగ్రెస్‌ నేతలపై ఎదురుదాడి ప్రారంభించారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూపుతూ, హామీలను నిలబెట్టుకునే తత్వం కాంగ్రెస్‌ రక్తంలోనే లేదని, తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ గెలిస్తే అదే పరిస్థితి ఏర్పడుతుందని కేసీఆర్, కేటీఆర్‌ సహా ఆ పార్టీ నేతలంతా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల మాటలను నమ్మితే నట్టేట మునిగినట్టేనని పేర్కొంటూ వస్తున్నారు. 

అక్కడ అంత లేదంటూ బీఆర్‌ఎస్‌ ఎదురుదాడి 
సరిహద్దులోని కర్ణాటక వాసులు తెలంగాణకు వచ్చి, కర్ణాటకలో కాంగ్రెస్‌ హామీలు సరిగా అమలు కావటం లేదంటూ ఆరోపించిన తీరును బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఈ తరుణంలో ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. బహుళజాతి సంస్థ ఫాక్స్‌కాన్‌  హైదరాబాద్‌ శివారులో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాగా, దాన్ని బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రచేసిందని, హైదరాబాద్‌ బదులు బెంగళూరులో కంపెనీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఆ సంస్థ చీఫ్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ లేఖ రాశారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు.

ఈ సందర్భంగా లేఖ ప్రతిని కూడా విడుదల చేశారు. అయితే, అది తాను రాసింది కాదని, అది ఫేక్‌ లెటర్‌ అంటూ డీకే శివకుమార్‌ ప్రకటించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ అంశం మరుగున పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు ఢిల్లీ హైకమాండ్‌ పవర్‌ సెంటర్‌గా ఉంటుందని, ఇప్పుడు ఢిల్లీతోపాటు బెంగళూరు కూడా పవర్‌సెంటర్‌గా మారి హైదరాబాద్‌ జీరో అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇలా నిత్యం ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య కర్ణాటక కాకరేపుతూనే ఉంది. 

మరిన్ని వార్తలు