నకిలీ వైద్యుడి నిర్వాకం.. 46 మందికి హెచ్‌ఐవీ

7 Feb, 2018 01:56 IST|Sakshi

ఉన్నావో (యూపీ): ఓ నకిలీ వైద్యుడి చేసిన పనికి 10 నెలల్లో దాదాపు 46 మంది హెచ్‌ఐవీ బాధితులుగా మారారు. కలుషిత సిరంజీతో రోగులకు ఇంజెక్షన్‌ చేయడంతో ఈ దారుణం జరిగింది. యూపీలోని ఉన్నావో జిల్లా బంగర్మౌలో గతేడాది ఏప్రిల్‌–జూలైలో అధికారులు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లుగా తేలింది. అలాగే గత నవంబర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా మరో 13 హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయి.

ఇంతకింతకు పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులను సీరియస్‌గా పరిగణించిన వైద్యాధికారులు ఇద్దరు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. కమిటీ సభ్యులు ప్రేమ్‌గంజ్, చక్మిర్‌ పూర్‌ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి 24, 25, 27 తేదీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి 566 మందిని పరీక్షించారు. ఇందులో మరో 21 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు తేలింది. మొత్తం 46 మంది హెచ్‌ఐవీ బారిన పడినట్లు వెల్లడైంది. రాజేంద్ర కుమార్‌ అనే నకిలీ వైద్యుడు దీనికి కారణమని అధికారులు గుర్తించారు. చౌకవైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చిన రోగులకు ఒకే కలుషిత సిరంజీతో ఇంజక్షన్‌ చేయడం ద్వారానే హెచ్‌ఐవీ సోకిందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు