81వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

81వ రోజు పాదయాత్ర డైరీ

Published Wed, Feb 7 2018 1:55 AM

YS Jagan 81day padayatra dairy - Sakshi

06–02–2018, మంగళవారం
సంగం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా


పేదవాడికి ఈ పరిస్థితి వస్తే..  ప్రాణాలు పోగొట్టుకోవాలా?
సిద్ధిపురం దగ్గర ఓ అమ్మ తన దయనీయ పరిస్థితిని నాకు చెప్పింది. రెక్కల కష్టంమీద బతికే ఆ తల్లికి పుట్టెడు కష్టమొచ్చింది. ఏడేళ్ల కూతురికి లివర్‌ జబ్బు వచ్చిందట. కాలేయ మార్పిడే పరిష్కారమని డాక్టర్లు చెప్పారంది. ఆ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి.. తన శరీరంలో భాగమైన కాలేయాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడింది. అయినా, లక్షలు ఉంటే తప్ప కాలేయ మార్పిడి సాధ్యం కావడంలేదని బావురుమంది. ఆ తల్లి మనోవేదన మనసున్న ఎవరినైనా కదిలిస్తుంది. నిజంగా ఆరోగ్యశ్రీకే ఆంక్షలు లేకపోతే.. ఇలాంటి పేదరాలు ఈ రోజు ఇలా కన్నీళ్లు పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. పేదవాడికి ఈ పరిస్థితే వస్తే ప్రాణాలు పోగొట్టుకోవాలా? పాలకులు ఆలోచించాల్సిన అంశమిది. మన ప్రభుత్వంలో ఇలాంటి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది. 

పూర్తికాని సంగం బ్యారేజీ పక్క నుంచి ఈ రోజు మ«ధ్యాహ్నం నడుస్తూ ఉంటే.. మనసెంతో బరువెక్కింది. ముందుకు అడుగులు భారంగా పడ్డాయి. నాన్నగారు ఉంటే.. ఎప్పుడో పూర్తయిపోయేది కదా అన్పించింది. అప్పట్లో బ్రిటిష్‌ పాలకులు ఎంతో దూరదృష్టితో ఈ ప్రాంత వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంత సౌభాగ్యం కోసం, భవిష్యత్‌ తరాల అభ్యున్నతి కోసం.. దాదాపు ఒకటిన్నర శతాబ్దం కిందట ఈ బ్యారేజీని నిర్మించారు. స్వతంత్ర భారతావనిలో ఎందరో పాలకులు మారినా.. ఈ ఆనకట్ట గురించి ఆలోచించిన దాఖలాల్లేవు. నాన్నగారు దీని విశిష్టతను గుర్తించి ఒకటిన్నర లక్షల ఎకరాలకు నీరిచ్చే మహదాశయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన తదనంతరం నేటి పాలకుల ఉదాశీనతకు, నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఈ ప్రాజెక్టు నిలిచింది. 

ఈ ఆలోచనల్లో ఉండగనే, బ్యారేజీ వద్ద గిరిజన కాలనీకి చెందిన మహిళలు.. ఏళ్ల నుంచి తమకు మరుగుదొడ్లు లేవని, ఎన్నిసార్లు విన్నవించుకున్నా మంజూరు చేయడం లేదని బాధపడ్డారు. బహిర్భూమికి పెన్నా గట్టుకు వెళ్లాలంటే చాలా సిగ్గుగా ఉందని వాపోయారు. వారి దయనీయ పరిస్థితి చూసి జాలేసింది. సిగ్గుపడాల్సింది వీరు కాదు, ఈ దుస్థితికి కారణమైన పాలకులు. ఏఎస్‌ పేట దళితవాడకు చెందిన అక్కచెల్లెమ్మలది మరో వ్యథ. మరుగుదొడ్లు కట్టుకుని ఎనిమిది నెలలైనా బిల్లులు రాని దుస్థితి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. ఈ రోజు చంద్రబాబుగారు చేసిన ప్రకటన చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే, ప్రజల మీద, అధికారుల మీద ధర్నా చేస్తాడట.

ఇంతకన్నా చోద్యం ఎక్కడైనా ఉంటుందా? ఈయనగారి పాలనలో.. మరుగుదొడ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతి అంతా ఇంతా! పాత వాటికి, అసంపూర్తిగా ఉన్న వాటికి, అసలు కట్టనివాటికి కూడా బిల్లులు చేసుకుంటున్నారు పచ్చ చొక్కాల వారు. అర్హులైన ఎంతోమంది పేదలకు మరుగుదొడ్లు మంజూరు చేయడంలేదు.. మంజూరైన వాటికి బిల్లులు చెల్లించడం లేదు. మరుగుదొడ్ల లబ్ధిదారుల ఎంపికకూ జన్మభూమి కమిటీలే సిఫార్సులు చేయాలట. వాటిలోనూ పార్టీల పట్ల వివక్ష చూపుతున్నారట. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా? ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నచందంగా, పైస్థాయిలో మీరు వేల కోట్ల రూపాయల అవినీతి చేస్తుంటే, కింది స్థాయిలో మీ అనుయాయులు, మీ జన్మభూమి కమిటీలు.. మరుగు దొడ్లు, పింఛన్లు, రేషన్‌ కార్డులు.. ఇలా వేటినీ వదలకుండా దోచేయడంలో ఆశ్చర్యమేముంది? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే ప్రజల మీద ధర్నా చేస్తానన్నారు.. మీరు నిజంగా ధర్నా చేయాల్సి వస్తే, ప్రజల మీద కాదు.. మీ మీద, ప్రజలకు ఆ పరిస్థితి కల్పించిన మీ పరిపాలన మీద కాదా?  
- వైఎస్‌ జగన్‌

Advertisement
Advertisement