లోక్‌సభలో ఎన్నికల సవరణ బిల్లు

25 Feb, 2016 03:19 IST|Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల తొలిరోజే పార్లమెంటులో వేడి మొదలైంది. పలు అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం మొదలవ్వగా కేంద్రం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. భారత్-బంగ్లాదేశ్  సరిహద్దు ఒప్పందం ద్వారా భారత్‌లో విలీనమైన గ్రామాల ప్రజలకు ఓటుహక్కు కలిపించే ఎన్నికల చట్టం (సవరణ) బిల్లును కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ బుధవారం లోక్‌సభలో  ప్రవేశపెట్టారు. దీంతోపాటు 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వ్యవధి మే 29న ముగుస్తుండటంతో అక్కడ ఎన్నికలు జరిపేందుకు వీలైనంత త్వరగా ఈ బిల్లుకు కేంద్రం ఆమోదింపజేయాల్సి ఉంది.

ఈ బిల్లు రెండ్రోజుల్లో ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందని కేంద్రం భావిస్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున కొంతకాలంగా లెఫ్ట్ పార్టీలు ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నాయని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి లోక్‌సభలో మండిపడ్డారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో పాటు వివిధ పార్టీలు పలు అంశాలపై విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
 
లోక్‌సభలో.. భారతదేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 77 మౌలిక వసతుల కల్పన (పవర్, పెట్రోలియం, రైల్వే..) ప్రాజెక్టులకు అనుకున్నదానికన్నా రూ.1.29లక్షల కోట్లు ఎక్కువ ఖర్చయిందని షెడ్యూల్, గణాంకాల మంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. దేశవ్యాప్తంగా 1.55 లక్షల పోస్టాఫీసులను రూ. 5వేల కోట్ల ఖర్చుతో కంప్యూటరీకరణ చేయనున్నట్లు టెలికాం మంత్రి రవిశంకర్ వెల్లడించారు. దాదాపు వెయ్యి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా అభివృద్ధి పరిచామని మరికొన్ని స్టేషన్లను 2009-10లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా అభివృద్ధి పరచనున్నట్లు రైల్వే మంత్రి లోక్‌సభకు తెలిపారు.
 
రాజ్యసభలో.. అమాయక ముస్లింలెవరూ జైళ్లలో మగ్గటం లేదని హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరీ రాజ్యసభకు వెల్లడించారు. పఠాన్‌కోట్ ఘటన, తర్వాత విచారణలో వెల్లడైన అంశాలను కేంద్రం పార్లమెంటుకు వివరించింది.

మరిన్ని వార్తలు