మాజీ సీఎం మనవడి అరెస్ట్

15 Oct, 2016 22:23 IST|Sakshi
మాజీ సీఎం మనవడి అరెస్ట్

పాట్నా: మద్యం బాటిల్స్ కలిగి ఉన్నాడన్న కారణంతో మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ మనవడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కత్వారా సమీపంలోని దోభీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్పీ అవకాశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ మనవడు విక్కీ కుమార్ మాంఝీ మద్యం బాటిల్స్ ను కారులో తీసుకెళ్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు సీఎం మనవడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న 12 బీర్ బాటిల్స్, మరికొన్ని బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల విక్కీ మాంఝీ.. జీతన రామ్ మాంఝీ కూతురి కుమారుడు.  

విక్కీతో పాటు కారులో ఉన్న అతడి ఫ్రెండ్ రవి కుమార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి గయ సెంట్రలో జైలుకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. గత అక్టోబర్ 2న రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం విక్కీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ చట్టం ప్రకారం బిహార్ లో పూర్తి మద్యపాన నిషేధం విధించారు.

మాజీ సీఎం మాంఝీ మాట్లాడుతూ.. తన మనవడు ఏ తప్పిదం చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే అతడ్ని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులు కావాలనే రాజకీయం చేస్తున్నారని, ఒకవేళ తన మనవడు విక్కీ మాంఝీ ఏదైనా తప్పిదానికి పాల్పడినట్లయితే.. చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చునని చెప్పారు. వాస్తవాన్ని వక్రీకరించి చూపిస్తున్నారని మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు