పేదల డాక్టర్‌ ‘పున్నమరాజు’

15 Oct, 2016 22:33 IST|Sakshi
పేదల డాక్టర్‌ ‘పున్నమరాజు’
కామవరపుకోట: వైద్యో నారాయణో హరి.. అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనం దివంగత డాక్టర్‌ పున్నమరాజు వెంకట రమణారావు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన జీవితాంతం పేదల వైద్యసేవకే  అంకితమయ్యారు. 1944 సంవత్సరంలో కామవరపుకోట చుట్టు పక్కల గ్రామాలలో కలరా, మలేరియా విజృంభించినప్పుడు ఆయన దేవుడిలా వైద్యం అందించి రోగులను రక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన ఆయన ఇక్కడ పసర్ల వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పేద రోగులను చూసి చలించిపోయారు. సంపాదన చూసుకోకుండా ఇక్కడే స్థిరపడి 1944 నుంచి 1984 వరకూ రోగులకు వైద్య సేవలందించారు. ఆయన చనిపోయి 19 సంవత్సరాలు అవుతున్నా నేటికి ఇక్కడి ప్రజలు ఆయన్ని తలచుకోని రోజు లేదు. నేడు ఆయన శత జయంతి. ఈ సందర్భంగా ఆయన వారసులు ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
 
వైద్య విద్య పూర్తి చేసుకున్న సమయంలో డాక్టర్ రమణారావు (వృత్తంలో)
 
1916 అక్టోబరు 16న తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పున్నమరాజు వెంకటరత్నం, కొండమ్మ దంపతులకు వెంకట రమణారావు జన్మించారు. 14 ఏళ్ల వయస్సులో ప్రస్తుత జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరానికి చెందిన వరహాలమ్మను 1930లో వివాహం చేసుకున్నారు. అప్పటికింకా చదువు పూర్తి కాలేదు. భార్య వరహాలమ్మ తనకు పుట్టింటివారు ఇచ్చిన నగలను ఇవ్వగా వాటిని అమ్మి రమణారావు 1939లో మద్రాసులో ఎల్‌ఐఎం(లైసెన్సియేట్‌ ఇండియన్‌ మెడిసిన్‌) కోర్సులో చేరి 1943లో పూర్తి చేశారు. 1944లో కామవరపు కోట చుట్టు పక్కల గ్రామాల్లో పరిస్థితిని చూసి చలించి ఇక్కడే ప్రాక్టీసు ప్రారంభించారు.
 
అప్పుడే ఎల్‌ఐఎం విద్యను పూర్తి చేసుకుని వచ్చిన పున్నమరాజు వెంకట రమణారావు ఆ పరిస్థితులను చూసి చలించిపోయారు. చుట్టు పక్కల గ్రామాలకు సైకిల్‌పై లేదా జట్కాబండిపై వెళ్లి రోగులకు వైద్యసేవలు అందించేవారు. ఫీజు ఇస్తేనే తీసుకునేవాడు. డిమాండ్‌ చేసేవారు కాదు. క్షయ వ్యాధిని నయం చేయడంలో దిట్టయని ప్రతీతి చెందారు. ఎందరికో ప్రాణ భిక్ష పెట్టిన ఆయన 1997 జూన్‌ 19న 80 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. తన ఎనిమిది మంది సంతానాన్ని ఉన్నత చదువులు చదివించి వృద్ధిలోకి తీసుకువచ్చారు. తన వారసత్వాన్ని మనుమలు, మనుమరాండ్రకు కూడా అందించి చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవర్చారు. 
 
ఆయన పేరిట సేవా కార్యక్రమాలు 
రమణారావు స్మారకార్థం ఆయన కుటుంబ సభ్యులు దశాబ్ద కాలంగా స్థానిక జూనియర్‌ కళాశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందజేస్తున్నారు. శతజయంతి సందర్భంగా ఆదివారం స్థానిక పీహెచ్‌సీకి మంచాలు అందించనున్నారు. రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా విదేశాల్లో ఉన్నవారితో సహా ఆయన వారసులు కామవరపుకోటలోని రమణారావు ఇంట్లో ఆత్మీయ సమావేశం కానున్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా