వరదల్లో ఫేక్‌ న్యూస్‌ బురద

21 Aug, 2018 21:34 IST|Sakshi

సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలు, ఫొటోలు

కేరళను ఒకవైపు వరద, మరోవైపు నకిలీ వార్తల బురద ముంచెత్తుతోంది. కేరళకు వరదసాయం అందించడంలో సోషల్‌ మీడియా క్రియాశీల పాత్ర పోషిస్తోంది. అయితే, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో విపరీతంగా సర్క్యులేట్‌ అవుతున్న కొన్ని నకిలీ వార్తలు, పాత ఫొటోలు మాత్రం కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అలాంటి కొన్ని వార్తలు..  

‘ఒక వ్యక్తి లైఫ్‌ జాకెట్‌ వేసుకోవడానికి నిరాకరించాడు. దీనికి కారణం అది కాషాయ రంగులో ఉండడమే. కాషాయం హిందూత్వకు సంబంధించిన రంగు కావడంతో బాధితుడు వేసుకోనని తేల్చి చెప్పాడు. చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు‘అంటూ ఒక పోస్టు వైరల్‌ అయింది. చివరికి ముఖ్యమంత్రి పి.విజయన్‌ లైఫ్‌ జాకెట్లను కాషాయం రంగుకి బదులుగా ఆకుపచ్చ రంగులో తయారు చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారంటూ ఆ వార్తకు మసాలా అద్దారు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కూడా దానిని ప్రచురించింది. కానీ చివరికి అది ఫేక్‌ అని తేలింది.
 ‘మరికాసేపట్లో ముల్లపెరియార్‌ డ్యామ్‌ కూలిపోతుంది. ఇప్పటికే ఆనకట్ట లీక్‌ అవుతోంది. మరో కొద్ది సేపట్లో డ్యామ్‌ కూలిపోవడం ఖాయం. ఎర్నాకుళం మునిగిపోతుంది. పీఎంవోలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం స్వయంగా చెప్పాడు. ఆ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా సురక్షిత స్థావరాలకు వెళ్లిపోండి‘ అంటూ ఒక ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారి ప్రజల్లో భయభ్రాంతుల్ని సృష్టించింది. చివరికి అది ఫేక్‌ అని, అలాంటి ప్రమాదమేమీ లేదని  ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది.  
 కేరళవ్యాప్తంగా రోజంతా విద్యుత్‌ నిలిపివేస్తారు. ముందు జాగ్రత్తగా మీ మొబైల్స్‌ అన్నీ చార్జ్‌ చేసుకోండంటూ కేరళ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (కెఎస్‌ఈబీ) అలర్ట్‌ అంటూ ఒక ఫేక్‌ న్యూస్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం అయింది. చివరికి విద్యుత్‌ బోర్డు అలాంటిదేమీ లేదంటూ స్పష్టమైన ప్రకటన చేయాల్సి వచ్చింది.  

మరికొన్ని నకిలీ వార్తలు
 ‘కేరళ ప్రభుత్వం సహాయ చర్యల్ని అడ్డుకుంటోంది. సైన్యం సహాయ చర్యల్లో పాల్గొనవద్దంటూ ఆంక్షలు విధించింది‘ అంటూ సైనిక దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం అయింది. అతనికి, సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ స్పష్టం చేసింది.
 ఇక వరదనీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్లల వీడియోని షాకింగ్‌ అంటూ సామాజిక మా«ధ్యమాల్లో విపరీతంగా షేర్‌ చేశారు. వాస్తవానికి అది కేరళ వీడియో కాదు. గతంలో ఒడిశాను ముంచెత్తిన వరదల సందర్భంలో తీసిన వీడియో ఇది.
 బీజేపీ కార్యకర్తనని చెప్పుకునే సురేష్‌ కొచ్చటి అనే అతను కేరళ వరద బాధితులందరూ సంపన్న కుటుంబాలని, వాళ్లకి ఎవరూ సాయం చేయాల్సిన అవసరం లేదంటూ ఒక ట్వీట్‌ చేశారు.  
కొచ్చి వరదల్లో బారులు తీరిన కారులంటూ వరద నీటిలో మునిగిపోయిన కారుల ఇమే జ్‌ ఒకటి విస్తృతంగా షేర్‌ అయింది. చివరికి అది అయిదేళ్ల క్రితం నాటిదని తేలింది.  
 ఇక కేరళ వరదలకి, అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి ముడిపెడుతూ వారికి తగిన శాస్తి జరిగిందని అంటూ కొందరు శాడిజం ప్రదర్శిస్తూ ఉంటే, మరికొందరు కుళ్లు జోకులు వేస్తూ రోత పుట్టిస్తున్నారు. కేరళ వరద బాధితులు కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటారు అంటూ ఒకరు ప్రశ్నిస్తే,  వరద బాధితులకు కండోమ్స్‌ కూడా పంపాలంటూ మరొకడు తన వెకిలితనాన్ని చాటుకున్నాడు. 

మరిన్ని వార్తలు