పొత్తులపై చంద్రబాబు కీలక సమావేశం | Sakshi
Sakshi News home page

పొత్తులపై చంద్రబాబు కీలక సమావేశం

Published Tue, Aug 21 2018 10:26 PM

Chandra Babu Naidu Discus With Ministers On Alliance - Sakshi

అమరావతి : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తులపై దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుందని చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులపై మంగళవారం స్థానిక మంత్రులు, ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమై చర్చించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో, జాతీయ రాజకీయల్లో ఉన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై నేతలతో మాట్లాడారు. దీనికి మంత్రులు, నేతలు సుముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను, కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించారు.

ప్రత్యేక హోదాపై బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇస్తామంటే కాంగ్రెస్‌తో పొత్తు ఉండే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపినట్టు సమాచారం. బీజేపీ ప్రభావం రాష్ట్రంలో రోజురోజుకు మసక బారుతోందని, కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గుతోందని కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే బాగుంటుందని చంద్రబాబుకి పలువురు నేతలు సూచించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తు అవకాశం ఉంటుందని గతకొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలో తెలంగాణ నేతల అభిప్రాయం తెలుసుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

ఈ సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల గురించి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో ఎలా వ్యవహరించాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ అంటుంటే.. కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుందని.. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
Advertisement