జమ్మూ కశ్మీర్‌లో కాల్పులు.. నలుగురు హతం

27 Apr, 2020 09:16 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో మరోసారి తుపాకుల మోతమోగింది. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో నాలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని గుద్దర్ గ్రామ సమీప దేవ్‌సర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు కుల్గాం పోలీసు సూపరింటెండెంట్‌ తెలిపారు. దేవ్‌సర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందటంతో భద్రత దళాలు, స్థానిక పోలీసులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.

గడిచిన వారం రోజుల్లో దక్షిణ కశ్మీర్‌లో ఇది నాలుగో ఎన్‌కౌంటర్‌ కావటం గమనార్హం. ఇక ఈ నాలుగు ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఏప్రిల్‌ మాసంలో చోటుచేసుకున్న అన్ని ఎన్‌కౌంటర్లలో 26 మంది మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తంగా 58 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. 

>
మరిన్ని వార్తలు