‘గూగుల్’ డ్యాన్స్..!

31 Mar, 2015 02:04 IST|Sakshi

పార్టీ జోరుగా సాగుతోంది. డ్యాన్స్ ఫ్లోర్‌పై అందరూ హుషారుగా చిందేస్తున్నారు. మీకూ ఉత్సాహంగా ఉంది. కానీ.. అడుగులు తడబడ్డాయి. దీంతో నలుగురిలో సిగ్గుతో కూడిన బెరుకు వల్ల వచ్చిన వణుకు కారణంగా.. చప్పట్లు, కేరింతలకే పరిమితమైపోయారు. అయితే, కళ్లజోడు కంప్యూటర్ ‘గూగుల్ గ్లాస్’ను పెట్టుకుంటే ఇక మీరు ధైర్యంగా చిందేయవచ్చు. పాట ఏదైనా.. మైకేల్ జాక్సన్‌లా స్టెప్పులు అదరగొట్టొచ్చు. వినిపిస్తున్న పాటకు అనుగుణంగా డ్యాన్స్ స్టెప్పులను నేర్పేలా గూగుల్ గ్లాస్‌ను ఆ కంపెనీ తీర్చిదిద్దుతోంది మరి!
 

డ్యాన్స్ అంటే బిడియపడేవారికి గూగుల్ గ్లాస్ అప్పటికప్పుడు నృత్యం నేర్పనుంది. వినిపిస్తున్న పాటను బట్టి.. తన డేటాబేస్‌లోని స్టెప్పుల్లో తగిన వాటిని మీకు చూపిస్తుంది. ఇంకేం.. కళ్లజోడు తెరపై కనిపించే స్టెప్పులను ఫాలో అయితే సరి.. మీరు కూడా బాగా డ్యాన్స్ చేయగలరు. వినూత్నమైన ఈ టెక్నాలజీకి గూగుల్ కంపెనీ తాజాగా పేటెంట్ పొందింది. పాటకు ఇతరులు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు? మీరు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నది బొమ్మల రూపంలో కూడా గూగుల్ గ్లాస్ చూపించనుంది.

అయితే, ఇప్పుడు, అప్పుడు అంటూ మార్కెట్లోకి రావడానికి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న నేపథ్యంలో గూగుల్ గ్లాస్‌ను ఆ కంపెనీ రద్దు చేసుకుందన్న ప్రచారమూ సాగుతోంది. కానీ ఇదంతా అబద్ధమని, ప్రాజెక్టు కొంత ఆలస్యం మాత్రమే అయిందని గూగుల్ చైర్మన్ ఎరిక్ స్కిమిట్ ప్రకటించారు. ఇంతకుముందు ప్రకటించిన టెక్నాలజీలతో పాటు ఈ డ్యాన్స్ టెక్నాలజీని కూడా జోడించి తమ కంప్యూటర్ కళ్లజోడును తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఇక గూగుల్ గ్లాస్ వాడకంలోకి వస్తే.. ఎక్కడ చూసినా ‘గూగుల్ డ్యాన్స్’లే కనిపిస్తాయేమో!

మరిన్ని వార్తలు