ఎన్నికలకు ప్రభుత్వ నిధులు సరికాదు!

24 Mar, 2015 02:41 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం, ఇతర ఖర్చులకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలనే యోచనను కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. ప్రభుత్వం ఇచ్చే నిధుల వ్యయంపై పర్యవేక్షణ సాధ్యమయ్యే పని కాదని ఈసీ వ్యాఖ్యానించింది. పార్టీలు, అభ్యర్థుల వ్యయం విషయంలో పారదర్శకత, జవాబుదారీ కోసం తగిన సంస్కరణలు తీసుకువచ్చే పక్షంలో ప్రచార వ్యయంకోసం రాయితీలు కల్పించవచ్చని ఈసీ అభిప్రాయపడింది. ఈనెల 30వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో ఇదే అంశంపై సమావేశం ఉన్న నేపథ్యంలో సోమవారం ఎన్నికల సంఘం సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. ఎన్నికల ప్రచారం, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు, బహిరంగ సభలకు పార్టీలు, అభ్యర్థులు భారీగా వ్యయం చేస్తున్నట్టు మీడియా వార్తలు పేర్కొంటున్న నేపథ్యంలో డబ్బు ప్రమేయం పెరగడం ఆందోళనకరమని పేర్కొంది. కార్పొరేట్ కంపెనీలు, సంపన్నులు ఆయా అభ్యర్థులకు నిధులు సమకూర్చడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఈసీ సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 78 బీ ప్రకారం కేంద్రప్రభుత్వం అభ్యర్థులకు కొన్నిరకాల వస్తువులను సరఫరా చేయడానికి వీలుంటుందని, దీనినే కొంత విస్తృతపరచి అభ్యర్థులకు రాయితీకింద ఉచితంగా ప్రచార వేదికలు, ముద్రణ, ఉచిత తపాలా సౌకర్యాలు కల్పించవచ్చని ఈసీ సూచించింది.
 

మరిన్ని వార్తలు