‘ఎస్సీ, ఎస్టీ’ చట్టానికి సవరణ బిల్లు

17 Jul, 2014 02:32 IST|Sakshi

న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలోపేతం చేసే పలు ప్రతిపాదనలతో ఒక బిల్లును ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు(ఎస్సీ, ఎస్టీలు కానివారు) తమ విధులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం శిక్షార్హ నేరంగా పరిగణించాలని అందులో ప్రతిపాదించారు. కేసు నమోదు, ఎఫ్‌ఐఆర్ రూపొందించడం, బాధితుల స్టేట్‌మెంట్ నమోదు..

లాంటి విధుల్లో కావాలని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే.. సంబంధిత అధికారులకు ఆరునెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు. అలాగే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి.. ఆయా రాష్ట్రాలు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి గెహ్లాట్ ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లులో ఉంది. ఈ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఈ మార్చిలో రాష్ట్రపతి జారీ చేశారు.
 

>
మరిన్ని వార్తలు