వారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్‌..

25 Dec, 2019 09:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింలు జీవించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్‌ దేశాలున్నాయని, హిందువులకు మాత్రం కేవలం భారతదేశంలోనే తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఉందని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వ కల్పించే చట్టాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. సబర్మతి ఆశ్రమం వద్ద పౌర చట్టానికి మద్దతుగా జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి గుజరాత్‌ సీఎం మాట్లాడారు. ఈ అంశంపై జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ల వైఖరులకు విరుద్ధంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్‌లో 22 శాతంగా ఉన్న భారత జనాభా వారిపై దౌర్జన్యం, హింసాకాండ, లైంగిక దాడుల కారణంగా ప్రస్తుతం కేవలం మూడు శాతానికి పడిపోయిందని అన్నారు. అందుకే హిందువులు భారత్‌కు తిరిగిరావాలని కోరుకుంటున్నారని, వారు మాతృదేశంలో గౌరవంగా జీవించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలు ప్రపంచంలో 150 దేశాల్లో ఎక్కడైనా తలదాచుకోవచ్చని హిందువులకు కేవలం భారత్‌ ఒక్కటే ఆశ్రయం ఇచ్చే దేశమని, హిందువులు ఇక్కడకు తిరిగి రావాలనుకుంటే సమస్య ఏమిటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు