మేయర్ కిరీటం ఎవరికో..

18 Aug, 2014 23:42 IST|Sakshi

పింప్రి, న్యూస్‌లైన్: నిబంధనల ప్రకారం పుణే నగర మేయర్ పదవి రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి) మారడంతో పైరవీలు, సిఫార్సులకు తెరలేచింది. అన్ని కులాల కార్పొరేటర్లు ఈ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పుణే కార్పొరేషన్‌లో ప్రస్తుత కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్సీపీ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఈ పార్టీ కార్పొరేటర్లంతా మేయర్ పదవి కోసం పైరవీలు మొదలుపెట్టారు.  మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మేయర్ అభ్యర్థి ఎంపిక ఎన్సీపీ కత్తి మీద సాములా మారింది.

ప్రస్తుతం కార్పొరేషన్‌లో అధికారం కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి చేతిలో ఉంది. వచ్చే నెల 15వ తేదీలోపు మేయర్ పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇవి జరుగుతుండడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. దీనికితోడు ఏ కులం/వర్గం నుంచి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.

 ఎన్సీపీ కార్పొరేటర్లు దిలీప్ బరోటే, దత్తా ధనకవడే, బాబూరావు చాండేరే, బాలా సాహెబ్ బోడకే, వికాస్ దాంగట్, విశాల్ తాంబే, చేతన్ తూపే, ప్రశాంత్ జగతాప్‌తోపాటు మరికొందరు అటు మేయర్ ఇటు ఎమ్మెల్యే టికెట్లకు పోటీపడుతున్నారు. మేయర్ పదవి దక్కనివారంతా అసెంబ్లీ అభ్యర్థిత్యానికి పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్సీపీ నాయకులు వేరే పార్టీల్లో చేరారు. ఈసారి కూడా ఇలాగే జరిగితే పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని ఎన్సీపీ వర్గాలు భావిస్తున్నాయి.  మరోవైపు రాష్ట్రంలో రిజర్వేషన్ల ఉద్యమాలు తీవ్రరూపం దాల్చాయి.

 ఎన్సీపీ మరాఠా రిజర్వేషన్లకు అనుకూలమనే ముద్ర పడింది. దీంతో పలు కులాలు ఈ పార్టీపై కన్నెరజేస్తున్నాయి. ధన్‌గార్, వడార్ కులస్తులు తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ రోడ్లెక్కారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ అధిపతి పవార్ తాము కూడా ధన్‌గార్ల రిజర్వేషన్లకు అనుకూలమేనని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇటువంటి సంకటస్థితిలో నగర మేయర్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించారు. సభాపక్ష నాయకుడు సుభాష్ జగతాప్‌ను మేయర్‌గా ఎన్నుకున్నా ఆశ్శర్యపడవలసిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తాము ఏ ఒక్క కులానికీ కొమ్ముకాయటం లేదని చెప్పుకోవడం సాధ్యమవుతుందని ఎన్సీపీ భావిస్తోంది. అంతేగాక దళిత ఓటర్లను దగ్గర చేసుకోవడానికి ఈ వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
   
  కార్పొరేషన్‌లో పార్టీల వారీగా బలాబలాలు
 ఎన్సీపీకి 56 మంది, కాంగ్రెస్-29, ఎమ్మెన్నెస్-28, బీజేపీ-26, శివసేన-15 మంది చొప్పున సభ్యులు ఉన్నారు.
 ఇప్పటి వరకు ఎన్సీపీ నుంచి మేయర్లుగా పనిచేసిన వారు రాజలక్ష్మీ భోసులే, మోహన్ సింగ్  రాజ్‌పాల్, వైశాలీ బన్కర్ ఉండగా, ప్రస్తుతం చంచలా కోడ్రే కొనసాగుతున్నారు.

>
మరిన్ని వార్తలు