INDIA Bloc Meeting Postponed: ‘ఇండియా’ భేటీ వాయిదా

6 Dec, 2023 05:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్‌ మూడో వారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున బుధవారం జరగాల్సిన భేటీకి రాలేకపో తున్నట్లు కూటమిలోని కొన్ని పార్టీల నేతలు అశక్తత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఫ్లోర్‌ లీడర్లతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో బుధవారం సాయంత్రం తలపెట్టిన సమావేశం మాత్రం కొనసాగనుంది.

కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్‌ మూడో వారంలో అందరికీ అనుకూలమైన తేదీలో జరగనుందని ‘ఇండియా’ ప్రచార కమిటీ సభ్యుడు గుర్దీప్‌ సప్పాల్‌ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. బుధవారం జరగాల్సిన భేటీకి తాము రాలేకపోతున్నట్లు ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్, టీఎంసీ చీఫ్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బిహార్‌ సీఎం, జేడీయూ నితీశ్‌ కుమార్‌ అనారోగ్య కారణాలతో, తమిళనాడు సీఎం స్టాలిన్‌ తమ రాష్ట్రంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలిపారని సప్పాల్‌ వివరించారు.

>
మరిన్ని వార్తలు