ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రుణ మాఫీ

29 Jan, 2017 02:30 IST|Sakshi
ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రుణ మాఫీ

► విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై
► రాజ్యాంగ పరిధిలో రామ మందిర నిర్మాణం
► యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ వరాల జల్లు


లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికీ వరాల జల్లు కురిపించింది. యువత, రైతులే లక్ష్యంగా ఉచిత నజరానాలతో పాటు వివాదాస్పద రామ మందిర నిర్మాణం, త్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలనూ చేర్చింది. యూపీలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ పరిధులకు లోబడి రామ మందిరాన్ని నిర్మిస్తామని, త్రిపుల్‌ తలాక్‌పై ముస్లిం మహిళల అభిప్రాయాలు సేకరించి.. వాటిని సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని పేర్కొంది. యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లతో పాటు వన్ జీబీ డేటా, భారీ స్థాయిలో ఉద్యోగాలు... రైతులకు పంట రుణాల మాఫీ, 24 గంటల విద్యుత్‌ అందిస్తామంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామంది.

శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ మేనిఫెస్టో... ‘లోక్‌ కల్యాణ్‌ సంకల్ప పత్ర్‌’ను విడుదల చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల ఎస్పీ, బీఎస్పీ పాలనలో యూపీ అన్నింటా వెనుకపడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ నాయకత్వంలో తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని అమిత్‌షా చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు.
యూపీ ఎన్నికలు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు ఏడు దశల్లో 403 స్థానాలకు జరగనున్నాయి.

మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు...
♦ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లతో పాటు 1జీబీ డేటా
♦ అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై...
♦ ‘అహల్యాబాయి విద్యా పథకం’ కింద రాష్ట్రంలోని బాలికలందరికీ డిగ్రీ వరకు ఉచిత విద్య
♦  అలాగే బాలురకు 12వతరగతి వరకు ఉచిత విద్య
♦ దళిత నాయకుడు అంబేడ్కర్, ఓబీసీ నాయకుడు అహల్యాబాయి హోల్కర్‌ల పేరిట ఎస్‌సీ, ఓబీసీలకు స్కాలర్‌షిప్‌లు
♦ 90 శాతం ఉద్యోగాలు యువతకు
♦ ఐదేళ్లలో అన్ని ఇళ్లకూ గ్యాస్‌ కనెక్షన్ .. నగరాల్లో గ్యాస్‌ పైప్‌లైన్
♦ చిన్న, సన్నకారు రైతులకు పంట రుణాల మాఫీతోపాటు ఇకపై వడ్డీలేని రుణాలు. – రాష్ట్రంలో 24/7 విద్యుత్‌ సరఫరా... పేదలకు చౌక ధరకే విద్యుత్‌
♦ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్కులు
♦ క్లాస్‌–3, 4 ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకుఇంటర్వూ్యలు లేకుండా మెరిట్‌ ఆధారంగా రిక్రూట్‌మెంట్‌
♦ అక్రమంగా నడుస్తున్న జంతువధ శాలల తొలగింపు
♦  కాల్‌ చేసిన 15 నిమిషాల లోపే పోలీసులు ఘటనా స్థలికి చేరేలా డయల్‌ 100 సేవలు మరింత మెరుగు
♦ కళాశాలల్లో ఈవ్‌టీజింగ్‌ నుంచి బాలికలను రక్షించేందుకు ‘యాంటీ–రోమియో స్క్వాడ్‌’. దీంతో పాటు ముగ్గురు మహిళల చొప్పున బెటాలియన్లు.
♦ పేదింట పుట్టిన ప్రతి ఆడ పిల్లకు రూ.5 వేలు
♦ భూ, గనుల మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యదళం

మరిన్ని వార్తలు