మూడేళ్ల తర్వాత ఏడ్చాడు!

19 Mar, 2018 01:57 IST|Sakshi
సంజయ్‌ దత్‌

తల్లి నర్గీస్‌ చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టని సంజయ్‌దత్‌

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ తన తల్లి నర్గీస్‌ కేన్సర్‌తో చనిపోయినప్పుడు అస్సలు కన్నీరు పెట్టుకోలేదట. మూడేళ్ల అనంతరం ఆమె చివరి కోరికను ఆడియో టేప్‌లో విన్న దత్‌ నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నారట. డ్రగ్స్‌కు బానిస కావడం, ఓ ఇంట్లో రాత్రి కాల్పులు జరిపి అరెస్ట్‌ కావడం, ముంబై అల్లర్ల సందర్భంగా ఆయుధాలు సేకరించడం సహా సంజయ్‌ జీవితంలో జరిగిన అనేక నిజ సంఘటనలతో ‘సంజయ్‌దత్‌ – ది క్రేజీ అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ బాలీవుడ్స్‌ బ్యాడ్‌ బాయ్‌’ పుస్తకాన్ని యాసీర్‌ ఉస్మాన్‌ ఆసక్తికరంగా రాశారు.

సంజయ్‌ చిత్రం రాకీ విడుదలకు ముందు 1981, మే3న నర్గీస్‌ కేన్సర్‌తో చనిపోయారు.డ్రగ్స్‌కు తీవ్రంగా బానిసైన సంజయ్‌ను ఆయన తండ్రి సునీల్‌ దత్‌ చికిత్స కోసం అమెరికాలోని ఓ పునరావాస కేంద్రంలో చేర్పించారు. నర్గీస్‌ చివరిరోజుల్లో సంజయ్‌ కోసం మాట్లాడిన ఆడియో టేపుల్ని సునీల్‌ కుమారుడికి పంపారు.  ‘సంజూ.. అన్నింటికంటే ముందు నువ్వు వినయంగా ఉండాలి. నీ సత్ప్రవర్తనను మార్చుకోకు. ఎవ్వరి మెప్పు కోసం ప్రయత్నించవద్దు. ఎల్లప్పుడూ వినయంగా ఉండటంతో పాటు పెద్దలను గౌరవించు. ఇవే నిన్ను ఉన్నతస్థానానికి తీసుకెళ్తాయి. నువ్వు చేపట్టే పనుల్లో ఇవే నీకు శక్తినిస్తాయి’ అని నర్గీస్‌ అందులో చెప్పారు.

మరిన్ని వార్తలు