దోషిగా తేలితే నా కాలు నరుక్కుంటా!!

20 Apr, 2016 20:17 IST|Sakshi
దోషిగా తేలితే నా కాలు నరుక్కుంటా!!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ పోలీసు గుర్రం శక్తిమాన్‌ మృతిపై జంతు ప్రేమికులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతున్నది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్‌ బుధవారం శక్తిమాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శక్తిమాన్ మృతి తీవ్ర విషాదకరమని, ఈ విషాదంపై స్పందించడానికి నోట మాట రావడం లేదని రావత్ అన్నారు. శక్తిమాన్ చక్కగా కోలుకుంటున్నదని తాము భావించామని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ఖూనీ చేసిన తరహాలోనే బీజేపీ ఎమ్మెల్యే దాడితో పోలీసు గుర్రం చనిపోవాల్సి రావడం బాధాకరమని కాంగ్రెస్ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు.

ఇలా జరుగుతుందని అనుకోలేదు!
బీజేపీ ఆందోళనలో గాయపడిన శక్తిమాన్‌ చక్కగా కోలుకుంటున్నదని, అది చనిపోతుందని తాము భావించలేదని, ఇది చాలా బాధాకరమని ఆ గుర్రానికి చికిత్స అందించిన వైద్యుడు ఖంబాటా తెలిపారు. మూడు కాళ్లతో గుర్రం బతకడం కష్టమని, అందుకే అది తుదిశ్వాస విడిచిందని, ఇకనైనా జంతు పరిరక్షణ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని జంతు హక్కుల కార్యకర్త, పెటా ప్రతినిధి భువనేశ్వరీ అన్నారు.

నా కాలు నరుక్కుంటా!
శక్తిమాన్ మృతిపై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి విచారం వ్యక్తం చేశారు. తాను ఆ గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల ఆ గుర్రం గాయపడలేదని ఆయన మరోసారి పేర్కొన్నారు. తాను గుర్రం కాలు విరగగొట్టినట్టు రుజువు చేస్తే.. అందుకు బదులుగా తన కాలును నరుక్కుంటానని గణేష్‌ జోషి పునరుద్ఘాటించారు. బీజేపీ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు