మరి మా నాన్నను చంపిందెవరు?

11 Dec, 2015 16:08 IST|Sakshi
మరి మా నాన్నను చంపిందెవరు?
ముంబై: 13 ఏళ్ల పాటు తన మదిలో మెదిలిన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయంటూ 2002 హిట్ అండ్ రన్ కేసు బాధితుడు బాంబే హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాను నిర్దోషిగా ప్రకటించడంపై ఆవేదన వెలిబుచ్చాడు. ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నూరుల్లా ఖాన్ కుమారుడు ఫిరోజ్ షేక్(25) తన తండ్రిని ఎవరు చంపారన్న ప్రశ్నకు ఇప్పటికీ తనకు సమాధానం దొరకలేదని వాపోయాడు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అతడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తన తండ్రికి ఆత్మకు శాంతి కలగలేదంటూ షైక్ కన్నీరు పెట్టాడు.  

ఆయన (సల్మాన్) అమాయకుడైతే మరి తన తండ్రిని చంపింది ఎవరని ఫిరోజ్  ప్రశ్నిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమాలంటే పడి చచ్చిపోయే తనకు, సల్మాన్ విడదల కావడంపై  బాధ లేదన్నాడు. కానీ, తన తండ్రిని పొట్టన పెట్టుకుంది ఎవరో తనకు తెలియాలని డిమాండ్ చేస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణమైన సల్మాన్ ను క్షమిస్తాను.. కానీ నిజమేంటో సమాజానికి తెలియాలని కోరుతున్నాడు.   

కాగా 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అయితే ఆనాటి ప్రమాదంలో తండ్రి నూరుల్లా ఖాన్ చనిపోవడతో ఫిరోజ్ షేక్ చదువు మానేసి కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. కాగా, సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మిశ్రమ  స్పందన వ్యక్తమైంది.
మరిన్ని వార్తలు