295 కోట్ల రోజ్‌వ్యాలీ ఆస్తుల జప్తు

30 Nov, 2014 01:36 IST|Sakshi

దేశంలోనే అతిపెద్ద అటాచ్‌మెంట్‌గా రికార్డు
సాక్షి, భువనేశ్వర్: అధిక వడ్డీ ఆశ చూపి అనధికారికంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన ఒడిశాలోని రోజ్‌వ్యాలీ గ్రూపుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఆ సంస్థకు చెందిన రూ.295 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ కోల్‌కతా జోనల్ ఈడీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద అటాచ్‌మెంట్‌గా పేర్కొంటున్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్  తదితర రాష్ట్రాల్లో రోజ్‌వ్యాలీ కి చెందిన 2,807 బ్యాంకు అకౌంట్లను ఈడీ  ఫ్రీజ్ చేసింది.

ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పొంజి స్కాంలో రోజ్‌వ్యాలీ అతిపెద్ద భాగస్వామి. ఇది అధిక వడ్డీ ఆశ చూపించి రూ.15 వేల కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించింది. ఒక్క ఒడిశాలోనే డిపాజిటర్లకు రూ.400 కోట్లు తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైందని ఈడీ పేర్కొంది. 27 కంపెనీల పేర్లతో డిపాజిట్లు సేకరించడంతోపాటు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. దీంతో బ్యాంకు ఖాతాలతో పాటు రోజ్‌వ్యాలీ ఎస్టేట్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్, రోజ్‌వ్యాలీ హోటల్-ఎంటర్‌టైన్‌మెంట్  ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ సంస్థకు ఒడిశాలోనే 65 బ్రాంచ్‌లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు