ఆటోవాలాల మానవత్వం

2 Feb, 2019 16:58 IST|Sakshi

ముంబై: రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితేనే పట్టించుకోని రోజులివి. ముంబైలో మాత్రం కొందరు ఆటోవాలాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వానరాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్‌ షాక్‌తో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిపోయిన కోతిని తీసుకెళ్లి వెటర్నరి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడితో వదిలేయకుండా వారం రోజులుగా వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ముంబైలోని మన్‌కుర్ద్‌ ప్రాంతంలో ఆటో స్టాండ్‌ ఉంది. స్టాండ్‌ సమీపంలో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఏం జరిగిందోనని కంగారుపడిన ఆటోవాలాలు.. ఆ చుట్టు పక్కల వెతికి చూశారు. కొద్దిసేపటి తర్వాత శరీరమంతా కాలిన గాయాలతో ఓ వానరం వారి కంటపడింది. కదలలేని స్థితిలో అక్కడే కూలబడిపోయి ఉంది. 

ఆ కోతి పరిస్థితి చూసి చలించిపోయిన ఆటోవాలాలు.. దాన్ని అక్కున చేర్చుకున్నారు. ఆ వానరాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆటోవాలాలకు అర్థం కాలేదు. వెటర్నరి ఆస్పత్రి కోసం గాలించినా లాభం లేకుండా పోయింది. చివరికి ఓ చోట ఆస్పత్రి ఉందని తెలుసుకొని అక్కడికి తీసుకెళ్లారు. ఆ వానరం వైద్యానికి అయ్యే ఖర్చును వారు రోజువారీ సంపాదనలో నుంచి తలా కొంచెం భరిస్తున్నారు. గాయాల నుంచి వానరం కూడా వేగంగా కోలుకుంటోంది.

మరిన్ని వార్తలు