అంతా బహిరంగమే

24 Jul, 2014 23:29 IST|Sakshi

 సాక్షి, ముంబై : నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు   ఎటూ సరిపోవడం లేదు. ముఖ్యంగా మురికివాడల ప్రజలు రోడ్లపైన, సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్రాలు విసర్జిస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసనమయం అవుతున్నాయి. నగరంలోని పలు మురికివాడల ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరుగుదొడ్ల సంఖ్య పెంచడంతోపాటు వాటికి మరమ్మతులు చేపట్టాలని కార్పొరేటర్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ను కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు బీఎంసీలోని గట్ నాయకులు మద్దతిచ్చారు. మరుగుదొడ్ల మంజూరు కోసం బీఎంసీ కమిషనర్ వద్దకు ప్రతిపాదన పంపించారు. కానీ కొత్తగా సౌచాలయాలు నిర్మించాలంటే అందుకు సరిపడా స్థలం నగరంలో ఎక్కడా లభించడం లేకపోవడంతో బీఎంసీ పరిపాలన విభాగం అందోళనలో పడిపోయింది.

 సంచార మరుగుదొడ్ల ప్రతిపాదన
 మరుగుదొడ్ల కొరత కారణంగా ముఖ్యంగా మురికివాడల్లో ఉంటున్న పేద ప్రజలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ప్రత్యామ్నాయంగా సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ఉచితంగా సేవ లందించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. కానీ ఈ సంచార మరుగు దొడ్లను కేవలం ఉత్సవాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా వాటిని అక్కడక్కడ ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగియగానే వాటిని బీఎంసీ యార్డులోకి తరలిస్తారు.

 వీటిని మురికివాడల్లో శాశ్వతంగా ఉంచాలంటే అది ఖర్చుతో కూడుకున్నది. దీన్ని యార్డు నుంచి అవసరం ఉన్న చోటికి తరలించేందుకు రూ.4,392 రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ సంచార మరుగుదొడ్డికి రూ.3000 డిపాజిట్ చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇలా మొత్తం రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా...? లేక దీన్ని వినియోగించే మురికివాడ ప్రజల నుంచి వసూలు చేయాలనేది స్పష్టమైన నియమాలు లేవు. బీఎంసీ ఈ సంచార సౌచాలయాలను ఉచితంగా సమకూర్చి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.

 ఉత్సవాల సమయాల్లోనే సాధ్యం
 ఉత్సవాల సమయంలో అంటే ఉదాహరణకు 26 జనవరి, మే ఒకటి, 15 ఆగస్టు, గణేశ్ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాళ్లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తారు. అది అత్యవసర సమయం కావడంతో ప్రజలకు మౌలికసదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత బీఎంసీపై ఉంటుంది. అందుకయ్యే వ్యయాన్ని కూడా బీఎంసీ భరిస్తోంది. కానీ ప్రతీ రోజు మురికివాడల ప్రజలకు ఉచితంగా సేవలు అందించాలంటే బీఎంసీ పరిపాలన విభాగానికి సాధ్యం కాదు.

మరిన్ని వార్తలు