మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్‌ అధ్యక్షుడు

9 Apr, 2020 09:47 IST|Sakshi

రియో డి జనీరో: బ్రెజిల్‌కు కష్టకాలంలో అండగా నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్‌ ప్రజలను ఉద్దేశించి జేర్‌ బోల్సోనారో గురువారం ప్రసంగించారు. కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని, భయపడాల్సిన పనిలేదని బ్రెజిల్‌ ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. కరోనా వైరస్‌ నివారణ పోరాటంలో ‘గేమ్‌ చేంజర్‌’గా భావిస్తున్నహైడ్రాక్సీక్లోరోక్విన్‌ విషయంలో తమ అభ్యర్థనపై నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మోదీతో జరిగిన చర్చల్లో... కరోనా చికిత్సకు అవసరమయ్యే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు ఇవ్వడానికి అంగీకరించారని వెల్లడించారు. కాగా, బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 16 వేల మందికిపైగా కరోనా వైరస్‌ సోకగా, 822 మంది మృతిచెందారు.
 

అయితే  ఈ ఔషధం కోసం జేర్‌ బోల్సోనారో భారత్‌కు ‘సంజీవని’ లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నివారణ పోరాటంలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు తమకు సరఫరా చేయాలని మోదీని కోరారు. ‘రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి పవిత్ర ఔషధాన్ని తెచ్చి రాముడి సోదరుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడు. అనారోగ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. బార్టిమేయుకు దృష్టిని పునరుద్ధరించాడు. సంయక్త బలగాలు, ఆశీర్వాదాలతో ప్రజలందరి మేలు కోసం భారత్‌, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగమించాలి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించండి. మీరు ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా భావిస్తాను’ అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో పేర్కొన్నారు.
చదవండి: భారత్‌కు పెరుగుతున్న డిమాండ్
మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు