చొరబాటు కుట్ర భగ్నం

27 Sep, 2017 01:49 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌లో చొరబాటుకు

పాక్‌ ఆర్మీ, ఉగ్రవాదుల యత్నం

తిప్పికొట్టిన భారత సైన్యం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని కేరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి చొచ్చుకొచ్చేందుకు పాకిస్తాన్‌ ఆర్మీ, ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాల్ని మంగళవారం భారత సైన్యం తిప్పికొట్టింది. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ) భారత ఆర్మీ పోస్టుల సమీపానికి రాగా సైన్యం దీటుగా బదులివ్వడంతో వారి చొరబాటు యత్నం విఫలమైంది. అదే సమయంలో పాకిస్తాన్‌ సైన్యం కాల్పులకు తెగబడగా.. భారత ఆర్మీ గట్టిగా సమాధానమిచ్చింది.

‘దాదాపు ఏడెనిమిది మందితో కూడిన సాయుధ చొరబాటుదారులు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ వైపు నుంచి చొరబాటుకు ప్రయత్నించారు. కుప్వారాలోని కేరన్‌ సెక్టార్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వారు దాదాపు భారత పోస్టుల సమీపానికి వచ్చి కాల్పులు జరిపారు. పాక్‌ కాల్పుల్ని మేం గట్టిగా తిప్పికొట్టాం. భారత్‌ వైపు ఎలాంటి నష్టం జరగలేదు’ అని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత సైనికుల తలల్ని నరికారంటూ వచ్చిన పుకార్లను ఆయన తోసిపుచ్చారు. ఈ చొరబాట్లు, కాల్పులు పాకిస్తాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ) పనేనని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. సైనికులతో పాటు, ఉగ్రవాదులు కూడా ఉండే బీఏటీ.. తరచూ సరిహద్దుల వెంట భారత సైన్యంపై దాడులకు పాల్పడుతుంటుంది.

మరిన్ని వార్తలు