సుశీల్ కుమార్ మోదీకి జేడీయూ వార్నింగ్

26 Oct, 2016 10:49 IST|Sakshi

లక్నో : బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్పై బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యలను జేడీయూ తీవ్రంగా ఖండించింది. సుశీల్ కుమార్ తన హుందాతనాన్ని కాపాడుకోవాలని జనతాదళ్ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ సూచించారు. 'ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా సీనియర్ నేతలు. వాళ్లే తమ భాషను అదుపులో పెట్టుకోలేకపోతే, వారిని చూసి యువత ఏం నేర్చుకుంటారు. సుశీల్ మోదీ హుందాగా ప్రవర్తించాలి' అని అన్నారు. ఇప్పటికైనా సుశీల్ కుమార్ మోదీ నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.

కాగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ను పెళ్లి చేసుకుంటామంటూ ఆయన వాట్సప్ నెంబర్కు ఏకంగా 44వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ ... తన పెద్దకొడుకును కాకుండా చిన్న కొడుకును డిప్యూటీ సీఎంను చేసిన లాలూ ప్రసాద్ యాదవ్..వాళ్ల వివాహ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తారేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చిన్నకొడుకు తేజస్వి యాదవ్కు పెళ్లి చేశాకే...పెద్ద కుమారుడికి వివాహం చేసేలా ఉన్నారన్నారు.

దీనికి తేజ్ ప్రతాప్ కౌంటర్గా  సుశీల్ కుమార్ మోదీ కుమారుడు ఇంపోటెంట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి విషయంలో ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన కుమారుడి గురించి ఆలోచిస్తే మంచిదని అన్నారు. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్, తేజ్ ప్రతాప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తేజ్ ప్రతాప్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన పరిణితి చెందలేదనిపిస్తోందని సుశీల్ కుమార్ మోదీ అన్నారు.

>
మరిన్ని వార్తలు