మీడియా పీక పిసికేయడం కొత్తకాదు

10 Jun, 2017 17:38 IST|Sakshi
మీడియా పీక పిసికేయడం కొత్తకాదు

న్యూఢిల్లీ:
భారత దేశంలో పాలకులకు, మీడియాకు మధ్య పోరాటం జరగడం, మీడియా గొంతు పిసికేయాలనుకోవడం బ్రిటీష్‌ పాలకుల నాటి నుంచే ఉంది. కోల్‌కతా నుంచి వెలువడుతున్న భారత్‌లో తొట్టతొలి, ఆ మాటకొస్తే ఆసియాలోనే మొట్టమొదటి పత్రికైనా ‘హికీస్‌ బెంగాల్‌ గెజిట్‌’ పత్రికను 1782, మార్చి 23వ తేదీన పాలకులు మూసివేయించారు. ఆ పత్రికను నడుపుతున్న ఆగస్టస్‌ హికీని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ వారెస్‌ హాస్టింగ్స్‌ను ఉద్దేశించి ‘లార్డ్‌ క్లైవ్‌కు దిక్కుమాలిన వారసుడు’ అని సంబోంధించినందుకు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు.
 
కొద్దికాలం జైలు జీవితం అనుభవించిన హికీ జైలు నుంచి, ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఐదారు కేసుల్లో ఇరుక్కోవడంతో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయన పేపర్‌ను మూసివేసి ప్రెస్‌ను స్వాధీనం చేసుకొంది. పత్రికల నోరు నొక్కేందుకు బ్రిటీష్‌ పాలకులు దేశద్రోహం నేరం కింద తీసుకొచ్చిన 124 ఏ సెక్షన్‌ నేటికి కూడా అమల్లో ఉండడం ఆశ్చర్యం. నేడు ఎన్డీటీవీపై సీబీఐ నిర్వహించిన దాడుల నేపథ్యంలో ఈ అంశాలను గుర్తుచేసుకోవాల్సి వస్తోంది. నాడు ఆగస్టస్‌ హికీ, నాటి బ్రిటీష్‌ పాలకులను ఎలా పడితే అలా విమర్శించేవారు. నేటి మీడియా కూడా ఆ స్థాయిలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్పందించడం లేదు. అయినా పత్రికలపై పరువు నష్టం కేసులు, దేశద్రోహం కేసులు పెడుతూనే ఉన్నారు.
 
ఎన్డీటీవీపై ఏసీబీ దాడులకు కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదని, తమ విధి నిర్వహణలో భాగంగానే ఏసీబీ దాడులు జరిపిందని పాలకపక్ష వర్గాలు చెబుతున్నాయిగానీ జరిగిన సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అనుమానాలు రాకపోవు. ఎన్డీటీవీ ఛానల్‌కు ఓ ప్రత్యేకమైన ఎజెండా ఉందని ఆరోపించిన బీజేపీ అధికార ప్రతినిధిని చర్చా గోష్టి నుంచి అర్దాంతరంగా వెళ్లిపోవాల్సిందిగా ఛానెల్‌ కోరడం, ఆ తర్వాత ఢిల్లీ జర్నలిస్టులు భయం, భయంగా తమ విధులు నిర్వహించాల్సి వస్తోందని ఛానెల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ రవిశ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల అనంతరమే ఏసీబీ దాడులు జరిగాయి. ఈ పరిణామాలకు సంబంధం లేదా పరిణామాలన్నీ కూడా యాదశ్చికమేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పరిగణిస్తున్న మీడియా తమ విధుల నిర్వహణలో ఇలాంటి అవాంతరాలను, పోరాటాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాల్సిందే.
                                                                                                                         -ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

మరిన్ని వార్తలు